సాక్షి బళ్లారి: జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు శుభవార్త. గుండె సమస్య ఉందంటే సామాన్య, మధ్యతరగతికి చెందిన వారు ఆస్తులు అమ్ముకొని శస్త్రచికిత్సలు చేయించుకునేవారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఇకపై బళ్లారిలోనే అధునాతన గుండె వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. అందులోను పేదప్రజలకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తుండటం బళ్లారి జిల్లా ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఓ వరంగా మారనుంది. నగరంలోని టీబీ శ్యానిటోరియం పక్కనే అత్యాధునికంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.
నాడు గాలి సోదరుల చొరవతో అంకురార్పణ
2008లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి, అప్పటి నగర ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి కృషి, పట్టుదలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. దాదాపు 18 ఏళ్లుగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా కొనసాగాయి. ఎట్టకేలకు ఆస్పత్రి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు. బెంగళూరు తరహాలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు. 6 నెలల క్రితం నుంచి ఆస్పత్రిలో వైద్య సేవలను ప్రారంభించినప్పటికీ ఔట్ పేషెంట్లకు మాత్రమే సేవలు నిర్వహించేవారు. ప్రస్తుతం గత నెల రోజుల నుంచి గుండెకు సంబంధించిన శస్త్రకిత్సలు, పరీక్షలు ప్రారంభించడంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అనుకూలంగా మారింది. బెంగళూరుకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా గుండె వ్యాధి నిర్థారణ అయిన వెంటనే బళ్లారిలోనే చికిత్స చేయనుండటంతో బాధితులతో పాటు ఆయా కుటుంబ సభ్యులపై కూడా ఆర్థికభారం భారీగా తగ్గనుంది.
30 రోజుల్లో 36 ఆపరేషన్లు
ఈసందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ సోమశేఖర్ సాక్షితో మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో 36 గుండె ఆపరేషన్లు నిర్వహించామన్నారు. తనతో పాటు డాక్టర్ మంజునాథ్, మధు జుమ్లా వంటి కార్డియాలజిస్ట్ డాక్టర్ల సహకారంతో అత్యాధునిక గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలను నిర్వహించామన్నారు. కార్పొరేట్ వైద్యానికి దీటుగా పేదలకు ఉచితంగా గుండెకు సంబంధించిన ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు.
ఆర్థిక భారం తగ్గిపోయింది
కాగా గుండె ఆపరేషన్లు చేయించుకున్న ప్రమీలారాణి, పద్మావతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గుండెకు సంబంధించిన సమస్య ఏర్పడటంతో బెంగళూరుకు వెళ్లినప్పుడు అక్కడ వివిధ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోగా ఆపరేషన్, ఇతర ఖర్చులకు దాదాపు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో బళ్లారిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచితంగా గుండె శస్త్ర చికిత్స పూర్తి చేయించుకున్నామన్నారు. ఉచితంగా గుండె ఆపరేషన్ చేయడంతో తమకు ఆర్థిక భారం తగ్గిపోయిందని సంతోషం వ్యక్తం చేశారు.
బళ్లారితో పాటు చుట్టుపక్కల
జిల్లాల ప్రజలకు శుభవార్త
బళ్లారిలో అందుబాటులో అధునాతన గుండె శస్త్రచికిత్సలు
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో
గుండె ఆపరేషన్లు ప్రారంభం
బెంగళూరు తరహాలో గుండెకు సంబంధించిన వైద్యసేవలు


