రాయచూరు రూరల్: జిల్లాలో నారాయణపుర కుడి కాలువ నుంచి ఆయకట్టు చివరి భూములకు నీరు వదలాలని ఒత్తిడి చేస్తూ ఆయకట్టు రైతులు, నేతలు ఆందోళన చేపట్టారు. బుధవారం దేవదుర్గ తాలూకా జాలహళ్లి అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మాట్లాడారు. కాలువలకు వార బందీ పద్ధతి ప్రకారం నీటిని విడుదల చేయరాదన్నారు. కుడి కాలువలో నీటి సామర్థ్యాన్ని తెలిపే గేజ్ నిర్వహణకు చర్య లు తీసుకోవాలన్నారు.
విరబూసిన బ్రహ్మకమలం
రాయచూరు రూరల్: నగరంలో బ్రహ్మకమలం విరబూసింది. ఏడాదికి ఒకసారి మాత్రమే విరబూసే బ్రహ్మకమలం కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అది తన స్వరూపాన్ని కోల్పోతుంది. రాయచూరులోని శ్రీరామనగర్ కాలనీలో అయ్యన గౌడ, గౌరమ్మ నివాసంలో బ్రహ్మకమలం విరబూయడంతో ప్రత్యేక పూజలు జరిపారు. విరబూసిన బ్రహ్మకమలాన్ని వీక్షించడానికి ప్రజలు తరలివచ్చారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
హుబ్లీ: పంచర్ అయిన లారీ టైరు మారుస్తుండగా వెనుక నుంచి దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొన్న ఫలితంగా ఇద్దరు స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన ధార్వాడ తాలూకా అమ్మినబావి గ్రామం వద్ద అర్ధరాత్రి చోటు చేసుకుంది. నిగధి గ్రామానికి చెందిన బసవరాజు, రవి కొళ్లి అనే ఇద్దరు మృతి చెందారు. కిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ నుంచి ధార్వాడ వైపు వస్తున్న లారీ అమ్మినబావి వద్ద పంచర్‌కు గురైంది. దీంతో లారీ డ్రైవర్ తదితరులు టైరు మారుస్తున్న సందర్భంలో కిత్తూరు నుంచి ధార్వాడ వైపు వస్తున్న బొలెరో వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొన్న తీవ్రతకు ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ధార్వాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించిన చికిత్స అందిస్తున్నట్లు ధార్వాడ గ్రామీణ పోలీసులు తెలిపారు.
బాల్య వివాహాలను అరికడదాం
హొసపేటె: విజయనగర జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలు, సంఘాలు, అధికారులందరి సహకారం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరమని అదనపు జిల్లాధికారి పీఎన్.లోకేష్ అన్నారు. జిల్లా పంచాయతీ సభాంగణంలో బాలల హక్కుల సాధికారతపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సంప్రదింపుల సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. బాల్య వివాహాలు సమాజానికి ఒక పెద్ద శాపం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నో ఏళ్లు గడిచినా, కఠినమైన చట్టాలు అమలులో ఉన్నప్పటికీ బాల్య వివాహాలు ఇప్పటికీ జరుగుతుండటం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందని ఆయన అన్నారు. పోలీసులు, పిల్లల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను అందించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ ఉప కార్యదర్శి కే.తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం
సాక్షి,బళ్లారి: ఈశాన్య ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి విధాన పరిషత్ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి శశీల్ నమోషిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బళ్లారి నగరంలో పలు విద్యా సంస్థల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యా రంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల ప్రయోజనాలు, విద్యా ప్రగతికి సంబంధించిన అంశాలపై చర్చించారు. శాసన మండలిలో సమర్థవంతంగా మాట్లాడే వ్యక్తికి ఓటు వేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తూ వారికి అండగా ఉంటారన్నారు. అఖిల భారతర వీరశైవ లింగాయత మహాసభ జిల్లా అధ్యక్షుడు బి.పంచాక్షరప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు గాలి శంకరప్ప, నగర పాలక సంస్థ సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాస్ మోత్కర్, పాలికె సభ్యులు కే.హనుమంతప్ప, కే.హేమణ్ణ, బీజేపీ నగర ఉపాధ్యక్షుడు కేదారనాథ్, సాధన హిరేమట్, శంభు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


