నాసిరకం విత్తనాలు.. నట్టేట రైతులు.! | - | Sakshi
Sakshi News home page

నాసిరకం విత్తనాలు.. నట్టేట రైతులు.!

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

హొసపేటె: నాసిరకం గుమ్మడి విత్తనాలు రైతులను నట్టేట ముంచాయని విజయనగర జిల్లా కొట్టూరు తాలూకా హాళ్యా గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు నాణ్యత లేని విత్తనాలు మరింత నష్టాన్ని మిగిల్చాయని రైతులు ఆరోపించారు. హాళ్యా గ్రామానికి చెందిన రైతులు హాలేష్‌, కొట్రేష్‌ అనే రైతులు దావణగెరెలోని బ్రహ్మలింగేశ్వర ఆగ్రో ఫెర్టిలైజర్స్‌ నుంచి రూ.18,600కు గుమ్మడి విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశారు. హాలేష్‌ మూడు ఎకరాల్లో, కొట్రేష్‌ ఒక ఎకరంలో విత్తనాలను నాటారు. నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమిలో అధిక దిగుబడి వస్తుందని ఆశించారు. అయితే మూడు నెలలు గడిచినా గుమ్మడి తీగలు బాగా పెరిగినప్పటికీ కాయలు మాత్రం కాయలేదని రైతులు తెలిపారు. ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు ఖర్చు చేయగా, మూడు ఎకరాలకు దాదాపు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టినట్లు హాలేష్‌ తెలిపారు. పెట్టుబడి పోయింది, దిగుబడి రాలేదు, పంటకు క్రమం తప్పకుండా నీరు అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

స్పందించని వ్యాపారి, అధికారులు

విత్తనాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, తమకు జరిగిన నష్టానికి విత్తన కంపెనీ, విక్రయించిన దుకాణదారుడు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తాము విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణానికి ఫోన్‌ చేసి సమస్యను వివరించినా సరైన స్పందన రాలేదని రైతులు ఆరోపించారు. విత్తనం కొనుగోలు చేసి సాగు చేశాం, పంట రాకపోతే తమకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? అని ప్రశ్నించారు. అధికారులపై కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన విషయాన్ని ఉద్యానవన శాఖ అధికారులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ సరిగా స్పందించలేదని రైతులు ఆరోపించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు వెంటనే పొలాలను సందర్శించి పంటను పరిశీలించాలని కోరారు. నాణ్యత లేని విత్తనాలను విక్రయించిన సంస్థ, దుకాణదారునిపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు తమకు తగిన పరిహారం అందించాలని బాధిత రైతులు హాలేష్‌, కొట్రేష్‌ డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యానవన శాఖ సహాయ సంచాలకుడి నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ తోటి రైతులతో కలిసి రాబోయే రోజుల్లో తీవ్ర ఆందోళన, పోరాటాలు చేపడతామని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున హెచ్చరించారు.

గుమ్మడి రైతులకు భారీగా పంట నష్టం

రూ.లక్షలాది ఖర్చు పెట్టినా పండని పంట

ఆశ వదులుకుని స్వచ్ఛందంగా

పంటను తొలగిస్తున్న రైతన్నలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement