రాయచూరు రూరల్: జిల్లాలో జరిగిన దళితుల హత్య కేసులను సీఐడీకి అప్పగించాలని భారత దళిత సంఘర్ష సమితి సంచాలకుడు ధర్మరాజు డిమాండ్ చేశారు. బుధవారం రాయచూరు తాలూకా మీరాపూర్ నుంచి మన నడక సమానత దిశగా పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు. పాత కక్షలను మనస్సులో ేపెట్టుకుని దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హద్దినాళలో బీఎస్పీ, దళిత కార్యకర్త భూమానంద హత్య, కరడకల్‌లో రేణుక హత్య, సిరవార తాలూకా హొక్రాణిలో అశ్వినిపై హత్యాచార ఘటనల్లో ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని, ఈ కేసుల దర్యాప్తును సీఐడీకి అప్పగించాలన్నారు. ఘటనలు జరిగి నెలలు కావస్తున్నా రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే కనీసం జిల్లాలో పర్యటించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
సమాజ సేవా రత్న పురస్కారం
బళ్లారిఅర్బన్: బళ్లారి చేనేత కార్మికుల సహకార ఉత్పత్తి అమ్మకాల సంఘం లిమిటెడ్ అధ్యక్షుడు బ్రహ్మయ్యకు సమాజ సేవా రత్న ప్రశస్తి లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ బాపూజీ 111వ జయంతి సందర్భంగా అందజేశారు. సమాజ సేవా రంగంలో సుమారు 40 ఏళ్లుగా బ్రహ్మయ్య అందిస్తున్న సేవలను గుర్తించి మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హనుమంతరావు, సంక్షేమ సంఘం నిర్వాహకులు సత్యనారాయణ, పద్మశాలి సంఘం అన్నసత్రాల అధ్యక్షుడు సిరివెరి కాశీనాథ్ తదితరుల చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని స్వీకరించారు. బళ్లారికి చెందిన బ్రహ్మయ్యకు సమాజ సేవారత్న పురస్కారం లభించడంతో చేనేత కార్మికుల సహకార ఉత్పత్తి, అమ్మకాల సంఘం రామకృష్ణ, ఉపాధ్యక్షుడు మురళి, కార్యదర్శి రంగస్వామి, డైరెక్టర్ లక్ష్మీదేవి, సొసైటీ సభ్యులు తదితరులు ఘనంగా సత్కరించి అభినందించారు.
యువత భాగస్వామ్యం సంప్రదాయాలకు నిదర్శనం
రాయచూరు రూరల్: గణపతి ఉత్సవాల్లో యువకుల భాగస్వామ్యం హిందూ ధర్మ సంప్రదాయాలకు నిదర్శనమని విజయపుర శాసన సభ్యుడు, హిందూ ఫైర్‌బ్రాండ్ బసవనగౌడ పాటిల్ యత్నాల్ పేర్కొన్నారు. నగరంలో వీర సావర్కర్ గజానన యువక మండళి గణపతికి పూజలు చేసి యువకులనుద్దేశించి ఆయన మాట్లాడారు. వినాయక ఉత్సవాల్లో భారతీయ సనాతన సంప్రదాయాలను అలవర్చుకుని శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. భవిష్యత్తులో హిందూ పార్టీ అధికారంలోకి వస్తే గణేష్ పండుగను జాతీయ పండుగలా ఆచరించేలా చూస్తామన్నారు.
స్నేహపూర్వక సేవలే
ఎదుగుదలకు గీటురాయి
హుబ్లీ: సహకార బ్యాంక్‌లను ఆర్థికంగా డిజిటల్ రూపంలో బలపరిచే దిశలో ఎన్‌యూసీఎఫ్‌డీసీ ముంబై, కర్ణాటక సహకార పట్టణ బ్యాంకుల మహామండలి బెంగళూరు ఆధ్వర్యంలో హుబ్లీ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ సౌజన్యంతో ఒక రోజు సదస్సు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ హోటల్‌లో జరిగిన ఈ సదస్సును మాజీ మంత్రి హెచ్‌కే పాటిల్ ప్రారంభించి మాట్లాడారు. సహకార బ్యాకింగ్ రంగం పటిష్టత ఆధునిక సాంకేతికతను అలవరుచుకోవడంతో పాటు వినియోగదారులతో స్నేహ పూర్వకంగా మెలిగి సేవలు అందించడంపై ఆధారపడి ఉంటుందన్నారు. హావేరి, గదగ, ధార్వాడ, ఉత్తర కన్నడ జిల్లాల్లోని 35 బ్యాంకుల డైరెక్టర్లు, అధ్యక్షులు, మాజీ మంత్రి హిండసగేరి, ఆ బ్యాంక్ అధ్యక్షుడు విక్రమ్ శిరూర్, డైరెక్టర్లు మల్లికార్జున, వెంకటేష్ ఉప్పారతో పాటు సీఈఓ పంచాక్షరి ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు.
సీఎం అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ ఆందోళన
హుబ్లీ: ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ లింగాయత మఠాలు, లింగాయత మఠాధిపతుల గురించి చులకనగా మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తూ హుబ్లీ ధార్వాడ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేశ్వాపుర సర్కిల్‌లో కార్యకర్తలు సీఎం అధికార మదంతో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. హుబ్లీలో ప్రసిద్ధ మూరు సావిరమఠం గురించి మూరుసావిర మఠం కానీ ఆరు సావిర మఠం కానీ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కుసంస్కృతికి నిదర్శనం అన్నారు. పార్టీ నేతలు రాజు కాళె, రామనగౌడ, కార్పొరేటర్ రాజన్న, మంజునాథ్, జయలక్ష్మి, గీత తదితరులు పాల్గొన్నారు.


