● వర్షం కోసం రుద్రాభిషేకం
తుమకూరు: సనాతన ధర్మంలో కుంభాభిషేకానికి ప్రాముఖ్యత ఉంది. శివునికి కుంభాభిషేకం చేస్తే, దేశమంతటా వర్షాలు కురుస్తాయి, పంటలు సమద్ధిగా పండుతాయి అని సిద్ధరబెట్ట వీరభద్ర శివాచార్య స్వామి అన్నారు. కొరటగెరె తాలూకాలో రెండవ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీగంగాధరేశ్వర స్వామి ఆలయంలో వర్షం కోసం రుద్రాభిషేకం, మహాకుంభాభిషేకం, హోమ–హవనం నిర్వహించారు. స్వామీజీ మాట్లాడుతూ మనమందరం కలిసి వర్షం కోసం ప్రార్థిస్తే, ఆ గంగాధరేశ్వరుడు తప్పకుండా వర్షాన్ని కురిపిస్తాడన్నారు. వర్షం కురవకపోతే రైతు బతకలేడని, రైతు లేకుంటే దేశం బతకలేదని ఆయన అన్నారు. పర్జన్య జపం, ఋష్యశృంగ జపం, సూర్య నమస్కారం, మహారుద్ర హోమం, మహామంగళారతి నెరవేర్చారు. అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
నకిలీ ఔషధ కార్ఖానా సూత్రధారి అరెస్టు
● దొడ్డేరి ఫాంహౌస్ కేసులో
ఎట్టకేలకు బెంగళూరుకు రప్పింత
బనశంకరి: రామనగర దొడ్డేరి ఫాంహౌస్‌లో వెలుగుచూసిన నకిలీ ఔషధాల తయారీ ముఠా సూత్రధారి ప్రశాంత్ రంజన్‌బాబును సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అజర్‌బైజాన్ నుంచి సోమవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయంలో దిగిన అతన్ని నిర్బంధించి విచారణకు తరలించారు. క్యాన్సర్‌కు ఉపయోగించే ఖరీదైన ఔషధాలు, టీకాలను ఈ ముఠా తయారు చేసి బెంగళూరుతో సహా అనేక రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు తేలింది. నకిలీ ఔషధాల తయారీ, సరఫరా, ఎంతమంది ఈ నెట్‌వర్క్‌లో ఉన్నారు అనేది రాబడుతున్నారు. అజర్‌బైజాన్‌లో ఔషధాలతో పట్టుబడిన అతన్ని బెంగళూరుకు రప్పించారు. మరో నిందితుడు వీరేశ్‌జైన్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహించాడు. బెంగళూరులోని ఆసుపత్రులు, మెడికల్ షాపులకు సరఫరా చేసేవాడు. ఈ ముఠా ఏటా రూ.15 కోట్ల వ్యాపారం చేసేది. ఆగష్టు 18వ తేదీన అధికారులు ఈ నకిలీ ఔషధ కార్ఖానాను గుట్టురట్టు చేశారు. టర్కీ నుంచి నకిలీ లేబుల్స్ తెప్పించి ఉత్తుత్తి మందుల సీసాలకు అతికించే అమ్మేవారు. దాడి సమయంలో రూ.5 కోట్ల నకిలీ, అవధి ముగిసిన ఔషధాలు లభించాయి.


