యశవంతపుర: ‘సివిల్ విషయాలలో పోలీసులు ప్రవేశించవద్దని అదేశించినా పదేపదే జోక్యం చేసుకుంటున్నారు, ఇలాగే చేస్తే మిమ్మల్ని యూనిఫారం విప్పి విచారిస్తాం’ అని హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది. వాణిజ్య భవనంలో విద్యుత్ పనులను పూర్తి చేసినందుకు ఒప్పందం ప్రకారం రూ.60 లక్షలు చెల్లించాలని, కానీ చెల్లించలేదంటూ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయగా, ఆ వాణిజ్య కట్టడం సిబ్బంది మీద మంగళూరు ఉళ్లాల పోలీసులు కేసు పెట్టి విచారణకు దిగారు. దీంతో కట్టడ యజమానులు, ఉద్యోగులు ఇది అక్రమ కేసు అని, రద్దు చేయాలని హైకోర్టులో కేసు వేశారు.
యూనిఫాం, టోపీ ఉండదు జాగ్రత్త
జస్టిస్ హైకోర్టు న్యాయమూర్తి వి శ్రీషానంద విచారించి అత్యంత ఘాటు పదజాలంతో పోలీసులను హెచ్చరించడం గమనార్హం. ఉళ్లాల ఠాణా సీఐ విరూపాక్షయ్యను తక్షణం సస్పెండ్ చేయాలని జడ్జి ఆదేశించారు, అయితే ప్రభుత్వ వకీలు, మంగళూరు పోలీసు కమిషనర్ ఇచ్చిన హామీతో జడ్జి మెత్తబడ్డారు. ‘విరూపాక్షయ్య 28 ఏళ్లుపాటు సర్వీసులో ఉంటూ, నిబంధనలకు విరుద్ధంగా భవన యజమాని బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. కోర్టు సస్పెండ్ అదేశాలను జారీ చేస్తే మీ ఒంటిపై యూనిఫారం, తలపై టోపీ ఉండదు. మిగిలిన సర్వీసు మ్యాటర్ ముగిసే వరకు కోర్టు చుట్టూ తిరుగుతారు’ అని న్యాయమూర్తి హెచ్చరించారు. యూనిఫాం ధరించి ఆ కాంట్రాక్టు కోసం వకాల్తా తీసుకుంటారా? ప్రశ్నించారు. కేసును అక్టోబర్ 14కు వాయిదా వేశారు. ఆలోపు సీజ్ చేసిన అకౌంట్లను విడుదల చేయాలని తెలిపారు. రూ.50.11 లక్షలను చెల్లించినా కాంట్రాక్టరు తప్పుడు కేసు పెట్టాడని పిటిషనర్ పేర్కొన్నారు.


