● కేంద్ర, రాష్ట్ర సర్కార్లపై ఏఐకేకేఎంఎస్ ధ్వజం
సాక్షి,బళ్లారి: రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఏఐకేకేఎంఎస్ రైతు సంఘం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సోమవారం ఏఐకేకేఎంఎస్ ఆధ్వర్యంలో మూడో తాలూకా స్థాయి సమావేశం జిల్లాలోని కురుగోడు పట్టణంలో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శశిధర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులకు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. విద్యుత్ ప్రైవేటీకరణ, అమెరికా– భారత్ వాణిజ్య ఒప్పందం, విత్తన చట్టం తదితర పేర్లతో కొత్త విధానాలను తీసుకు వచ్చి రైతులను సంక్షోభంలోకి నెడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులకు మంచి జరిగే ఒక్క పనిని కూడా చేయడం లేదన్నారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలకు మేలు చేసే దిశగా పెద్ద ఎత్తున పోరాటాలను చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రాకపోతే ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. జిల్లాధ్యక్షుడు గోవింద్, కార్యదర్శి గుర్రళ్లి రాజు, ఉపాధ్యక్షుడు బసన్న పాల్గొన్నారు.


