హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కానాహొసహళ్లి సమీపంలోని సరిహద్దు గ్రామం కానామడుగులో ఓ రైతు పొలంలో పండించిన బొప్పాయి పంటలో గణేష్ రూపంలో బొప్పాయి కాయి పండింది. గ్రామ రైతు బసవరాజ్ 2 ఎకరాల్లో బొప్పాయి తోట వేశారు. బొప్పాయిలో గణేశుడి బొమ్మ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆ బొప్పాయికి పూజలు చేశారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున వారి ఇంటికి తరలి వచ్చి దర్శించుకున్నారు.
విగ్రహ ప్రతిష్టాపన
సంప్రదాయబద్ధం
రాయచూరు రూరల్: గణపతి విగ్రహాల ప్రతిష్టాపన హిందూ సంప్రదాయాలకు నిదర్శనం అని కిల్లే మఠం శాంత మల్ల శివాచార్య అభిప్రాయ పడ్డారు. బుధవారం నగరంలోని కోటలో పరశురామ అవతార గణపతిని ప్రతిష్టాపన చేసి పూజలు జరిపి భక్తులనుద్దేశించి మాట్లాడారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. నగరసభ మాజీ సభ్యుడు దరూరు బసవరాజ్, నాగరాజ్, వెంకటేష్, కేశవ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
లోకాయుక్త ఆకస్మిక తనిఖీ
హొసపేటె: ప్రజల సమస్యలపై సరైన రీతిలో స్పందించడం లేదని, పరిపాలన వ్యవస్థలో లోపాలు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదుపై విజయనగర– బళ్లారి డివిజన్ లోకాయుక్త అధికారులు బుధవారం విజయనగర జిల్లాలోని కూడ్లిగి పట్టణ పంచాయతీ కార్యాలయాన్ని లోకాయుక్త అధికారులు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ పర్యటనలో ఒక ఎస్పీ , ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు పీఐలు పాల్గొని కార్యాలయంలోని రికార్డులను, పని తీరును పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సేవలందించడంలో అలసత్యం, ఉండకూడదని, ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మౌలిక సౌకర్యాలకు పెద్దపీట
రాయచూరు రూరల్: నగరంలో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని నగర పాలికె కమిషనర్ జుబిన్ మహాపాత్రో పేర్కొన్నా రు. బుధవారం నీరుబావి కుంట, రాంపూర్ తాగునీటి జలాశయం, షియాతలాబ్, ఎక్లాసపూర్ వంటి ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. మురుగు కాలువల్లో పూడి పోయిన చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రాంపూర్ తాగునీటి జలాశయాన్ని పరిశీలించి నగర ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలన్నారు.
గోవును జాతీయ మాతగా ప్రకటించాలి
బళ్లారిఅర్బన్: గోవును జాతీయ మాతగా ప్రకటించాలని విశ్వకర్మ అఖిల భారత మహిళా, యువజన సమాఖ్య జాతీయ మహిళా కార్యదర్శి పద్మావతి సుభాష్ ఆచార్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు ఎక్స్‌ప్రెస్ పోస్టు ద్వారా వినతిపత్రాలు పంపినట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో గోవుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
కడబగట్టిలో చిరుత ప్రత్యక్షం
హుబ్లీ: చిరుత ఓ దూడపై దాడి చేసి చంపిన ఘటన ధార్వాడ జిల్లా అళ్నావర తాలూకా కడబగట్టి గ్రామంలో చోటు చేసుకుంది. పొలంలో మేత మేయడానికి వదిలిన దూడను చిరుత దాడి చేసి చంపేసింది. చిరుత దాడి వల్లే దూడ మృతి చెందిందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. గత కొన్ని నెలల నుంచి ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు వదంతులు వచ్చాయి. తాజాగా జరిగిన ఈ ఘటనతో ఆ అనుమానం నిజమైంది. అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రాంతంలో సమీప పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా ఎలాంటి ప్రాణహాని జరగక ముందే చిరుతను బంధించాలని స్థానికులు డిమాండ్ చేశారు.


