హుబ్లీ: భార్యకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో కోపగించుకున్న భార్య తరఫున బంధువులు సదరు భర్తపై తీవ్రంగా దాడి చేసిన ఘటన ధార్వాడ ఉపనగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక్కడి మెహబూబ్‌నగర్ నివాసి శశిధర్ శిరాళె దాడికి గురైన వ్యక్తి. కొన్నేళ్ల క్రితం శశిధర్, ఆయన భార్య ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటీవల భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. దీనికి భర్త నిరాకరించారు. ఈక్రమంలో కోర్టు విచారణకు హాజరై ఇంటికి వెళుతున్న సందర్భంలో శశిధర్‌పై ఓ గుంపు ఇక్కడి ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు, చేతులకు బలమైన గాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఉపనగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వరుణుడి కృప కోసం
ప్రత్యేక పూజలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగంలో ఖరీఫ్ సీజన్‌లో పొలంలో వేసుకున్న పైర్లు వాడుముఖం పడుతున్న నేపథ్యంలో రైతులు దేవుళ్లకు మొర పెట్టుకుంటున్నారు. సిరవార తాలూకాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా బుధవారం జోకుమారుడికి పూజలు జరిపారు. గ్రామాల్లో బుట్టలో జోకుమారుడిని ఊరేగిస్తూ వానలు కురవాలంటూ పాటలతో దేవుడిని ప్రార్థించారు.
ఆన్‌లైన్‌లో రూ.లక్షలాది వంచన
హుబ్లీ: బిగ్‌బాస్కెట్‌లో వివిధ సామాన్లను రూ.298లకే అమ్ముతున్నట్లు ఉన్న లింక్‌పై క్లిక్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు రూ.3.39 లక్షలను దోచుకున్నారు. అనిల్‌కుమార్ సింగ్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్‌ను చూస్తూ సదరు లింక్‌పై క్లిక్ చేయగా రజనీష్ అనే వ్యక్తి ఫోన్ చేసి పిన్ నమోదు చేయమని చెప్పి విడతల వారీగా రూ.3,39,999 లను బదలాయించుకొని మోసగించినట్లు అనిల్‌కుమార్ నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
మరో ఘటనలో రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. బైక్ ప్రమాదంలో బాలుడు మృతి చెందగా, మరొకరు గాయపడిన ఘటన హుబ్లీ తాలూకా కరడికొప్ప రామపుర రోడ్డులో జరిగింది. ఖాజామోహిద్దీన్ మృతుడు. ద్విచక్ర వాహనంలో కరడికొప్ప నుంచి రామపుర వైపునకు వెళుతుండగా అదుపు తప్పి ప్రమాదం వాటిల్లింది. గాయపడిన ఇద్దరిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స ఫలించక ఖాజామోహిద్దీన్ (14) మృతి చెందాడని హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అధికారులు వేగంగా
స్పందించాలి
రాయచూరు రూరల్: ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి అధికారులు పనుల వేగానికి తగ్గట్టు పని చేయాలని బీదర్ దక్షిణ ఎమ్మెల్యే డాక్టర్ శైలేంద్ర బేల్దాళ్ అభిప్రాయ పడ్డారు. బుధవారం బీదర్ తాలూకా స్థాయి కేడీపీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రోడ్ల మరమ్మతులు, గుంతలు పూడ్చే విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. వ్యవసాయ శాఖ ఆధీనంలో కరువు విషయంలో రైతులకు సరైన సమాచారం అందించి పరిహారం లభించేలా చూడాలన్నారు. ఆరోగ్య శాఖలో వైద్యుల, సిబ్బంది కొరత, విద్యా శాఖలో ఉపాధ్యాయుల కొరత, పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన అంశాలపై అధికారుల నుంచి వివరాలను సేకరించారు.
24 మూగజీవాల మృతి
హుబ్లీ: బెళగావి జిల్లా చిక్కోడి నుంచి హుబ్లీకి ముగ్గురు గొర్రెల కాపరులు సుమారు 500 మేకల మందతో బయలుదేరారు. ఈక్రమంలో ఉన్నఫళంగా 24 మేకలు, గొర్రెలు మార్గమధ్యంలో ఉణకల్ వద్ద మృతి చెందాయి. పశుసంవర్ధక శాఖ వైద్యులు స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం పరీక్ష జరుపుతున్నారు. చిక్కోడి తాలూకా శమనవాడి, వనకే గ్రామాల నుంచి రామన్న, అశ్వత్, పుండలీక అనే ముగ్గురు గొర్రెల కాపరుల గొర్రెలు హుబ్లీ సమీపంలో ఉన్నఫళంగా అస్వస్థతకు గురయ్యాయి. వాటి కడుపులు ఉబ్బి సుమారు 20 మేకలు, 4 పొట్టేళ్లు మృతి చెందాయి. కాగా మేకలు ఎక్కడైనా విష ఆహారం సేవించాయా? అనేది పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత తగిన పరిహారం చెల్లిస్తామని హుబ్లీ టౌన్ తహసీల్దార్ మహేష్ గస్తీ తెలిపారు.
సహనంతో ఆత్మహత్యలకు చెక్
హొసపేటె: వ్యక్తి ఓపికగా, సహనంతో ఉంటే ఆత్మహత్యలను నివారించవచ్చు అని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ టీ.లింగరాజు అన్నారు. బుధవారం నగర మున్సిపల్ కౌన్సిల్ హాలులో నిర్వహించిన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సకాలంలో కౌన్సెలింగ్, సరైన సలహాలు, మార్గదర్శకత్వం చాలా ముఖ్యం అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎర్రగుడి శివకుమార్, వైద్యులు జంబయ్య నాయక్ పాల్గొన్నారు.


