మూగప్రాణులకు చిత్రహింసలు | - | Sakshi
Sakshi News home page

మూగప్రాణులకు చిత్రహింసలు

Sep 11 2026 10:51 AM | Updated on Sep 11 2026 10:51 AM

ప్రైవేటు వెటర్నరీ ఆస్పత్రిలో ఘోరం

దొడ్డబళ్లాపురం: పశువైద్య విద్య సాధన కోసం మత్తు మందు ఇవ్వకుండా కుక్క కాలు కత్తిరించడం, అక్రమంగా ప్రాణుల మీద ప్రయోగాలు చేస్తున్న ప్రైవేటు వెటర్నరీ ఆస్పత్రి దారుణాలు బెంగళూరులో వెలుగు చూశాయి. దొడ్డకన్నెలో గత నాలుగేళ్లుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఓ వెటర్నరీ ఆస్పత్రి నడుస్తోంది. దానిపై ఫిర్యాదులు రావడంతో జీబీఏ అధికారులు తనిఖీలు చేశారు. ప్రాక్టీస్‌ కోసం ఓ కుక్క కాలు కత్తిరించి వైద్యం చేయడం, మత్తు లేకుండానే శస్త్రచికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. పలు రకాల ప్రాణులను ఇక్కడ అక్రమంగా బంధించినట్టు తెలిసింది. ఆస్పత్రిని సీజ్‌ చేసి నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ప్రాణులను హింసించినందుకు ప్రత్యేక కేసులు నమోదు చేశారు.

రెండోరోజూ ఈడీ సోదాలు

మంత్రి జార్కిహొళి, భార్య, పిల్లల విచారణ

బనశంకరి: విదేశాల్లో అక్రమంగా నగదు పెట్టుబడి పెట్టారని మనీ లాండరింగ్‌, ఫెమా కేసుల కింద ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్‌ జార్కిహొళి, కుమార్తె, ఎంపీ ప్రియాంక, బావమరిది, అబ్కారీ డీసీ మంజునాథ్‌, ఆప్తుల నివాసాలు, ఆఫీసుల్లో గురువారం కూడా ఈడీ అధికారులు తనిఖీలు జరిగాయి. 18 చోట్ల సోదాలు చేస్తూ భారీమొత్తంలో రికార్డులు, ఫైళ్లు పరిశీలించారు. గోకాక్‌లో మంత్రి ఇల్లు, బెళగావిలో మంజునాథ్‌ ఇల్లు, మంజునాద్‌ పీఏ ప్రీతి కాకత్కర్‌ ఇల్లు, మంత్రి ఆప్తులైన విఠల పరసన్నవర, రాజు దరగశెట్టి, మలగౌడ పాటిల్‌ ఇళ్లలో సోదాలు పూర్తి చేశారు. ఏమేం లభించాయనేది ఈడీ అధికారులు త్వరలో ప్రకటిస్తారు.

గోకాక్‌లో మంత్రి భార్య శకుంతల, కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్‌లను సైతం ప్రశ్నించారు. అంతటా కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నాయి.

మంత్రికి నిద్ర లేకుండా..

బెంగళూరు నివాసంలో బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మంత్రి సతీశ్‌ని ప్రశ్నించారు. తెల్లవారుజామున 3 గంటలకు నిద్రపోవడానికి అవకాశమిచ్చారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మళ్లీ సోదాలు సాగించారు. అనేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈడీ దాడులను ఖండిస్తూ బెళగావి సహా పలు నగరాలలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ధర్నాలు నిర్వహించారు.

ఎమ్మెల్యే మునిరత్న, ముగ్గురు సీఐలపై కేసు

యశవంతపుర: ఓ మహిళ మీద అబద్ధపు ఎఫ్‌ఐఆర్‌ వేయించి ఆమెను అరెస్ట్‌ చేయించారనే ఆరోపణలతో నగరంలోని రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న, పోలీసు అధికారులతో పాటు 8 మందిపై ఆర్‌ఆర్‌ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. మునిరత్న, కిరణ్‌ నాయుడు, లోహిత్‌గౌడ, మంజునాథ్‌, లక్ష్మీ జయరామ్‌, పోలీసు సీఐలు ఐయణ్ణరెడ్డి, లోహిత్‌ బిఎన్‌, ఎస్‌ఐ చంద్రశేఖర్‌లపై కేసు నమోదైంది. తన మీద తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని, ఎలాగైనా జైలుకు పంపాలని వీరందరూ కుట్ర చేశారని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్‌ఆర్‌నగర పోలీసులు కేసు నమోదు చేయగా, సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

వృద్ధురాలి సమయస్ఫూర్తి

మైసూరు: చైన్‌స్నాచర్లు దాడి చేస్తే యువతులు, మహిళలే హడలిపోతుంటే ఒక వృద్ధురాలు సమయస్ఫూర్తితో బంగారాన్ని కాపాడుకుంది. ఈ ఘటన మైసూరు మేటగళ్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో మధురా నగర లేఔట్‌లో జరిగింది. పాలు తీసుకొచ్చేందుకు కమలాక్షమ్మ (85) అనే వృద్ధురాలు బయలుదేరింది. ఆటోలో వచ్చిన దొంగలు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె రెండు చేతులతో గొలుసును గట్టిగా పట్టుకోవడంతో పాటు కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వాళ్లు పరుగెత్తుకుని వచ్చారు. దీంతో భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఆమె ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement