ఎమ్మెల్సీ రవికి అపెక్స్ బ్యాంకు పగ్గాలు
శివాజీనగర: కర్ణాటక రాష్ట్ర అపెక్స్ బ్యాంక్ అధ్యక్షునిగా సీఎం డీ.కే.శివకుమార్ సమీప బంధువైన ఎమ్మెల్సీ రవిని, ఉపాధ్యక్షునిగా శరణగౌడ బయ్యాపురని ఎంపిక చేశారు. రెండున్నర సంవత్సరాలు వీరు పదవిలో ఉంటారు. సీఎం బుధవారం రాత్రి అపెక్స్ బ్యాంక్ 13 మంది డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. చివరకు, ఈ ఇద్దరిని పదవులకు ఎంపిక చేశారు. సహకార శాఖ మంత్రి లక్ష్మణ సవది మాట్లాడుతూ అందరి సమ్మతితో వారి ఎంపిక జరిగిందని అన్నారు. ఈ పోస్టులను ఆశించిన కేఎన్ రాజణ్ణ, శివానంద పాటిల్ తదితరులు నిరాశకు లోనయ్యారు.
ప్రజ్వల్ కస్సుబుస్సు
యశవంతపుర: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెల్‌లో మొబైల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు దొరికిన కేసులో రెండవరోజు విచారణ జరిగింది. ఫోన్‌లో ఎవరితో మాట్లాడారని పోలీసులు ప్రశ్నించారు. తనను అనవసరంగా ఇరికించారు, మాజీ ఎంపీని అని ప్రజ్వల్ కస్సుమన్నట్లు తెలిసింది. తన బెయిల్‌ను రద్దు చేయడానికి తప్పుడు కేసులు పెట్టారని, ఏమీ చెప్పను, ఏం కావాలో అది చేసుకోండి అని స్పష్టం చేసినట్లు సమాచారం. నన్ను సతాయిస్తే కోర్టులో అర్జీ వస్తానంటూ చెప్పాడు.
పోలీసుశాఖకు ఆధునిక వాహనాలు: హోంమంత్రి
బనశంకరి: పనితీరు మెరుగుపరచడం, ప్రజలకు పకడ్బందీగా సేవలు అందించే ఉద్దేశంతో పోలీస్‌శాఖలోని వాహన వ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. నగరంలో పోలీసు అధికారులు, వాహన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పోలీస్‌శాఖకు ఆధునిక వాహనాలకు బాడుగ పద్ధతిలో ఇచ్చే విధానంపై చర్చించారు. భారీసంఖ్యలో వాహనాలను కొనాలంటే ఎక్కువ పెట్టుబడి కావాలి, అందుకే లీజు పద్ధతి మేలని చర్చించారు. ప్రజలు డబ్బును వివేచనతో ఉపయోగించి పోలీస్‌శాఖ సమర్థతను పెంచడమే తమ ప్రాధాన్యత అన్నారు. శాంతిభద్రతల రక్షణ, గస్తీకి ఆధునిక వాహనాలు అవసరమన్నారు. కేవలం మానవ వనరులు చాలవని, టెక్నాలజీ, సౌకర్యాలు ముఖ్యమన్నారు. మారుతున్న సామాజిక, శాంతిభద్రతలకు సవాళ్లకు పోలీస్‌శాఖ సిద్ధమయ్యేలా ఆధునీకరిస్తామని తెలిపారు.


