రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటికే సాగు చేసిన లక్షలాది హెక్టార్లలో పంట నష్టం సంభవించే అవకాశాలున్నాయి. సామర్థ్యాన్ని బట్టి గేజ్ నిర్వహణ చేసి ఆయకట్టు చివరి భూములకు నీరందేలా నీటిని సరఫరా చేయడంలో అధికారులు తగిన జాగ్రత్తలు పాటించడం లేదు. గతంలో ముఖ్యమంత్రి యడియూరప్ప ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించినందువల్లే నేడు ఆయకట్టు చివరి భూములకు నీరందక వాణిజ్య పంటలు వాడుముఖం పట్టాయన్న వాదన వినిపిస్తోంది. సింధనూరు, మస్కి, కవితాళ, మాన్వి తాలూకాల్లో రెండు లక్షల హెక్టార్లలో వరిని, రాయచూరు, సిరవార తాలూకాల్లో లక్ష హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో మిరప పంటలను పండిస్తున్నారు.
నీరందించకుంటే పంట నష్టమే
చివరి భూములకు నీటిని అందిస్తే పంటలు చేతికందే అవకాశం ఉంది. లేకుంటే పంట నష్టం తప్పదు. కాలువకు నీటి సామర్థ్యం పెంచడం, గేజ్ నిర్వహణ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల పంటలు ఏపుగా పెరిగే సమయంలో నీటిలభ్యత కరువైంది. దీంతో దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. సింధనూరు తాలూకా ముక్కుంద గ్రామానికి చెందిన అయ్యప్ప అనే యువ రైతు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నీరు విడుదల చేస్తామని హామీలిచ్చిన నేతలు నేడు కనుమరుగయ్యారని ఆరోపించారు. తాము 20 ఎకరాలు స్వంతంగా, 4 ఎకరాలు లీజుకు తీసుకొని పంటలు సాగు చేశామని, నీరు లేక పంటలు మొత్తం వాడుముఖం పట్టాయని వాపోయారు.
ఎడమ కాలువ చివరి భాగానికి చేరని నీరు
ఆయకట్టులో ఎండుతున్న వాణిజ్య పంటలు


