బళ్లారి అర్బన్: బళ్లారి జిల్లాలోని గాణిగ కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కళ్యాణ కర్ణాటక గాణిగ జన అభివృద్ధి సంఘం అధ్యక్షుడు బసవరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్డులోని మున్సిపల్ కళాశాల మైదనంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రజాసేవ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర, జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్ తదితరులు హాజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. గాణిగ సమాజ అధ్యక్షుడు బసవరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో గాణిగ కులస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. బళ్లారి జిల్లాలో మాత్రం అవసరమైన పత్రాలను దరఖాస్తు చేసుకున్న వాటిని తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. కుల ధ్రువీకరణ పత్రాలు అందక విద్యార్థులు స్కాలర్‌షిప్స్‌కు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు పొందలేక పోతున్నారన్నారు. మధ్యవర్తుల ద్వారా డబ్బు చెల్లిస్తే సర్టిఫికెట్లు అందుతున్నాయని పేర్కొన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి గాణిగ కులస్తులకు పథకాలు అందేలా చూడాలని కోరారు.


