బనశంకరి: నగరంలో బనశంకరీదేవి ఆలయంలో అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రావణ శనివారం సందర్భంగా వేకువజామున సుప్రభాత సేవ తరువాత అర్చకులు అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం, అర్చనలు గావించి గాజులతో సుందరంగా సింగారించారు. మహిళా భక్తులు నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేశారు.
ఠాణాలో మహిళ ఆత్మహత్యాయత్నం
బనశంకరి: పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ న్యాయం జరగలేదని అక్కడే పురుగుల మందు తాగింది. ఈ ఘటన హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత జిల్లా కలబుర్గిలోని జేవర్గి తాలూకా నెలోగి పోలీస్‌స్టేషన్ లో శనివారం జరిగింది. యాతనూరు గ్రామానికి చెందిన రేవుబాయి భీమరాయ తళవార (40).. ఇంట్లో గొడవలపై నెలోగి ఠాణాలో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని ఆవేదన చెందిన రేవుబాయి అక్కడే పురుగుల మందు తాగి పడిపోయింది. ఆమెను కలబుర్గి జిల్లాసుపత్రికి తరలించారు. వెంటనే గ్రామస్తులు, బంధువులు చేరుకుని పోలీసుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిర్యాదు తీసుకోవడానికి ఇబ్బంది ఏమిటని రేవుబాయి కుమారుడు నాగరాజ్ విలపించాడు.
పొలంలో దారుణ హత్య
మండ్య: పొలంలో యువకున్ని దుండగులు కొడవళ్లతో చంపి మృతదేహాన్ని చిక్కదేవరాయ కాలువలోకి పారేసి పరారైన ఘటన జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలూకా కట్టేరి గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన విశ్వేశ్వరయ్య కుమారుడు నవీన్‌కుమార్ (28) హతుడు. చెలువరాజు, కాంతరాజు అనే ఇద్దరు పొలంలో ఉండగా, నవీన్ కుమార్ అప్పుడే వెళ్లాడు. దీంతో ఆ ఇద్దరు కొడవళ్లతో నవీన్‌కుమార్ తల, చెవి, చేతులపై దాడి చేసి చంపి శవాన్ని కాలువలో పారేసి పరారయ్యారు. నవీన్‌కుమార్ రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భయపడిన అతని తండ్రి పొలానికి వెళ్లి గాలించగా స్కూటర్ మాత్రమే ఉంది. దీంతో బంధువులు, గ్రామస్తులకు చెప్పగా అందరూ కలిసి వెతికినా జాడలేదు. కేఆర్‌ఎస్ పోలీస్ స్టేషన్ సీఐ వివేకానంద, ఎస్‌ఐ జగదీష్ సిబ్బందితో కలిసి కాలువలో గాలించగా మృతదేహం దొరికింది. దుండగులను అరెస్టు చేసినట్లు తెలిసింది.


