రాయచూరురూరల్: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వసంతోత్సవం నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి మఠంలో రాఘవేంద్ర స్వామి మూల విరాట్‌కు ఊంజల్ సేవలు నెరవేర్చారు. భక్తుల సందడి మధ్య శ్రీకృష్ణుడి వెన్నకుండ ఉట్టిని సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ కొట్టారు.
పీడీఓపై సస్పెన్షన్ వేటు
హుబ్లీ: విధి నిర్వహణలో లోపంతో పాటు నియమాల ఉల్లంఘన ఆరోపణలపై ధార్వాడ తాలూకా అళిగేరి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిణి పుష్పవతి మేదారపై సస్పెన్షన్ వేటు పరడింది. అక్రమ బిల్లుల సృష్టితో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా నకిలీ బిల్లులను సృష్టించిన ఆరోపణలపై పీడీఓపై ఈ చర్యలు తీసుకున్నారు. గ్రామస్తులే జిల్లా ఇంచార్జి మంత్రి సంతోష్‌లాడ్ దృష్టికి తెచ్చారు. ఆరోపణల నేపథ్యంలో మంత్రి సూచన మేరకు జెడ్పీ సీఈఓ భువనేశ్ పాటిల్ ఈ ఆదేశాలను వెల్లడించారు.
స్కూటీని ఢీకొన్న కారు.. మహిళ మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. సంతోష్ నగర్ జేకే స్కూల్ ఎదుట కారు స్కూటీని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో స్కూటీపై వెనుక కూర్చున్న విజయనగర నివాసి రూపా సోలంకి (60) తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలింతం దక్కలేదు. స్కూటీ నడుపుతున్న గోపనకొప్ప లిఖిత చేతులు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌పై హుబ్లీ తూర్పు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హాస్టల్ పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి గాయం
రాయచూరు రూరల్: రపభుత్వ హాస్టల్ పైకప్పు పెచ్చులూడి విద్యార్థినిఽకి గాయమైన ఘటన జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో చోటు చేసుకుంది. శనివారం దేవదుర్గ తాలూకా గబ్బూరులో ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో పైకప్పు పెచ్చు ఊడి పడడంతో పదవ తరగతి చదువుతున్న శృతి అనే విద్యార్థినికి తీవ్ర గాయమైంది. దీంతో బాలికను రాయచూరులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాంక్రీట్‌తో కూడిన పెళ్లలు మీద పడడంతో విద్యార్థులు అరుపులు, కేకలు వేస్తూ బయటికి పరుగు తీశారు. గది పైపెచ్చు ఊడుతోందని వార్డెన్ రాధికకు తెలిపినా ఫలితం లేక పోయిందని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఆమె నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని వారు ఆరోపించారు.
నిరంతర అధ్యయనంతో కొత్త ఒరవడి
రాయచూరు రూరల్: నిరంతరం అధ్యయనంతో ఆరోగ్య, వైద్య రంగాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయని రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ బీ.సీ.భగవాన్ పేర్కొన్నారు. నవోదయ వైద్య కళాశాలలో జరిగిన రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వ విద్యాలయం 218వ సిండికేట్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు త్వరితగతిన ఫలితాలు పొందాలనే ఆశకు తగినట్లుగా విద్యనభ్యసించ లేకపోతు న్నారన్నారు. నవోదయ వైద్య కళాశాల చేస్తున్న సేవలు అనన్యమన్నారు. పేదలకు ఉచిత సేవలు చేయడం అభినందనీయమన్నారు. నవోదయ వైద్య కళాశాల రిజిస్ట్రార్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ దొడ్డయ్య, రామ్ మోహన్ గుప్త, ప్రకాష్, మహ్మద్ సలా ఉద్దీన్, సురేష్ బాబు, శివరాజ్ గౌడ, అపర్ణ, లక్ష్మి, మంజునాథ్‌లున్నారు.
ప్రజల కోసం సేవా అభియాన్
కోలారు: ప్రజల ఇంటి ముందుకు పాలన వ్యవస్థను అందించడం ప్రజా సేవా అభియాన్ ముఖ్య ఉద్దేశమని తహసీల్దార్ వి.గీతా తెలిపారు. శనివారం ముళబాగిలు తాలూకా ఆవణి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రజా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వివిధ శాఖలకు చెందిన ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కే ఎన్ ఉమాశంకర్, తాలూకా పంచాయతీ ఈఓ ఎన్ వీ బాబు, తదితరులు పాల్గొన్నారు.


