సాక్షి, బళ్లారి: సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీ కృష్ణుడు దేవుడు కాదు.. ప్రతి తరానికి మార్గదర్శకుడు అని పలువురు వక్తలు కొనియాడారు. శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని నగరంలోని శ్రీ కృష్ణ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అర్చనలు చేసిన అనంతరం శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని ఊరేగించారు. జొళదరాఽశి దొడ్డనగౌడ రంగమందిరంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇస్కాన్‌లో పూజలు
బళ్లారి రూరల్: శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం ఇస్కాన్ మందిరానికి భక్తులు పోటెత్తారు. శ్రీకృష్ణుడి ప్రతిమను పల్లకీలో కొలువుదీర్చి నగర వీధుల్లో ఊరేగించారు. భక్తులకు కృష్ణుడిని దర్శించుకుని పూజలు చేయించారు. ఇస్కాన్ ప్రతినిధులు హరేరామ.. హరేకృష్ణ అంటు భజనలు చేస్తూ ముందుకు సాగారు.
కేంద్రియ విద్యాలయంలో..
హొసపేటె: టీబీ డ్యాంలోని కేంద్రియ విద్యాలయంలో శుక్రవారం కృష్ణాష్టమిని ఉత్సాహంగా జరుపుకున్నారు. పాఠశాల విద్యార్థుల కృష్ణుడు, రాధ వేషధారణలో నృత్యం చేశారు. చిన్ని కృష్ణులు, గోపికలతో పాఠశాలలో కోలహలం నెలకొంది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోహర్ లాల్ జింగర్, ఉపాధ్యాయులు ప్రకాష్, రమీజ, దీపిక, సునీత, విజయలక్ష్మి, ఆషియా బేగం, అఫ్తాబ్, గులాం ముస్తఫా, మహేష్, అప్సా, అబిద అంజలి, రాహుల్, ఈరన్న పాల్గొన్నారు.
శ్రీకృష్ణుడి చిత్రపటం ఊరేగింపు
రాయచూరు రూరల్: నగరంలోని శ్రీక్రష్ణ యాదవ భవనంలో జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగర సభ, సాంఘిక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి చిత్రపటానికి విధాన పరిషత్ సభ్యుడు బోసురాజ్ పూలమాల వేశారు. నగరేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన జాతాను ఎమ్మెల్సీ వసంత్ కుమార్ ప్రారంభించారు. సభలో నగర సభ మాజీ అధ్యక్షుడు తిమ్మప్ప నాడగౌడ, భీమన్న, హనుమంతప్ప, చెన్నారెడ్డి పాలొన్నారు.
శ్రీకృష్ణుడి ఊయల సేవ
రాయచూరు రూరల్: ఉప్పారవాడి లక్ష్మీ వేంకటేశ్వర మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చిన్నారులతో శ్రీకృష్ణుడి వేషధారణలు (పాత్రలు) వేయించారు. విఠల్ రుక్మిణి మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణాష్టమి సంబరాలు అంబరాన్నంటాయి.
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
గోపికలు, చిన్ని కృష్ణుల వేషధారణలో
ఆకట్టుకున్న చిన్నారులు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు


