యశవంతపుర: పల్లెటూరిలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి ప్రతిభావంతురాలిగా ఎదిగింది, ఐటీ కంపెనీలో కళ్లు చెదిరే వేతనంతో ఉద్యోగం సంపాదించింది. హావేరి జిల్లాకు చెందిన రైతు మంజునాథ్ కూతురు సృష్టి దక్షిణ కన్నడ జిల్లాలో బీటెక్ కోర్సు పూర్తి చేసింది. ప్రముఖ సంస్థ వీసా లో రూ.46.33 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని పొందింది. ఆమె అదే సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తూ ఉద్యోగానికి ఎంపికై నట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేవు.
చెరువులోకి దూకి
తల్లీకూతురు ఆత్మహత్య
యశవంతపుర: ఇంటిలో గొడవ జరిగి కోపంతో కూతురు పరుగున వెళ్లి చెరువులోకి దూకింది, అది చూసిన తల్లి కూడా అదే చెరువులోకి దూకడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన కొడగు జిల్లా మడికెరి తాలూకా తలకావేరి సమీపంలో తరమణ గ్రామంలో జరిగింది. ప్రియాంక (14), తల్లి ప్రేమ (35) మృతులు. ప్రియాంక 8వ తరగతి చదువుతోంది. చిన్న విషయమై తల్లితో గొడవ పడింది, తల్లి మందలించడంతో ఆక్రోశం పట్టలేక సమీపంలోని చెరువులోకి దూకేసింది, వెంబడిస్తూ వెళ్లిన తల్లి కూతురు వెంటే చెరువులోకి దూకడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
చెరసాలలో అక్రమాల పర్వం
● మండ్య జైలు అధికారి శతమ్మ
బళ్లారికి బదిలీ
మండ్య: విచారణ ఖైదీ అయిన శ్రీరంగపట్న ప్రభుత్వ అధికారి మహమ్మద్ హుస్సేన్‌కు సహాయం చేశారని, జైలులో డబ్బు చెల్లిస్తే రాజమర్యాదలు అందిస్తారని ఆరోపణలు రావడంతో జిల్లా జైలు ప్రధానాధికారి ఎం.శతమ్మను జైళ్ల చీఫ్ అలోక్ కుమార్ బళ్లారి సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. జైలులో అక్రమాలపై ఖైదీలు రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ వైరల్ అయిన తర్వాత ఈ ఉత్తర్వు వెలువడింది. ఫోర్జరీ విచారణ ఖైదీగా ఉన్న మహమ్మద్ హుస్సేన్.. అనారోగ్యం లేకున్నా జబ్బు సాకుతో మిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా కొందరు గుట్టురట్టు చేశారు. జిల్లా సెషన్స్ జడ్జి బృందం ఆసుపత్రిని తనిఖీ చేసి విచారించారు. ఈ కేసులో శతమ్మ నిర్లక్ష్యం స్పష్టం కావడంతో బళ్లారి జైలుకు బదిలీ చేసి ఆమె స్థానంలో ఫక్కీరప్ప బరకర్‌ను నియమించారు.
నమో శంభులింగేశ్వరా
బొమ్మనహళ్లి: శ్రావణ మంగళవారం సందర్భంగా హాసన్ జిల్లాలోని గండసీ గ్రామంలోని క్షేత్రనాథ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారికి రుద్రాభిషేకం, సహస్రనామ బిల్వార్చన, కుంభాభిషేకం, జలాభిషేకం తరువాత వివిధ పుష్పమాలలతో అలంకరించారు. స్వామి దర్శనానికి వేలాదిగా భక్తులు వచ్చి మొక్కుకున్నారు.
బాలునిపై పిచ్చికుక్క భీకర దాడి
● మండ్య వద్ద ఘటన
మండ్య: మండ్య తాలూకాలోని బేలూరు గ్రామంలో రోడ్డు పక్కన ఆడుకుంటున్న బాలునిపై పిచ్చికుక్క దాడి చేసి, కరిచి, ముక్కు, నోటిని ముక్కలు చేసింది. గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు, మన్విత్ గౌడ (8) బాలుడు ఆదివారం మధ్యాహ్నం, ఇంటి ముందు బాలలో ఆడుకుంటున్నాడు. ఓ పిచ్చికుక్క ఆకస్మాత్తుగా అతనిపై దాడి చేసింది. ఇది చూసి, ఇతర బాలురు పరిగెత్తిపోయారు. కుక్క కరవడంతో చిన్నారి ముక్కు, పెదవులు చీలికలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో కేకలు వేస్తుండగా తల్లిదండ్రులు వచ్చి కుక్కను తరిమివేసి, అతన్ని మిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని మైసూరులోని కె.ఆర్. ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పట్టించుకోలేదని బాలున్ని జేఎస్‌ఎస్ ఆసుపత్రిలో చేర్పించారు. మొదట కుక్క కాటుకు చికిత్స చేస్తున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముక్కు, పెదవులకు వైద్యం చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆ కుక్కను కొట్టి చంపేశారు.
తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో వైద్యం


