ఘనంగా ద్రౌపతమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ద్రౌపతమ్మ జాతర

Sep 4 2026 7:53 AM | Updated on Sep 4 2026 7:53 AM

బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ పట్టణంలో తళి రోడ్డులో ఉన్న భజన మందిరంలో వహ్నికుల సేవా సంఘం ఆధ్వర్యంలో ద్రౌపతమ్మ దేవి జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రధాన వీధుల్లో పల్లకీ ఊరేగింపు సాగింది. ద్రౌపదీ దేవి, ధర్మరాయస్వామి, కృష్ణ, భీమ, అర్జున విగ్రహాలను అలంకరించి ఊరేగించారు. భక్తులు ఇళ్ల ముందు స్వాగతం పలికి పూజలు చేశారు. మాయసంద్ర సహా పలుచోట్ల ద్రౌపతమ్మ దేవి ఆలయాల్లో వేడుకలు జరిగాయి.

బస్సు ఢీకొని మున్సిపల్‌ ఉద్యోగి మృతి

బాగేపల్లి: బాగేపల్లి పట్టణంలోని గూళూరు రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే ఎస్‌.ఎన్‌. సుబ్బారెడ్డి ఇంటి ముందు సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగి మున్సిపల్‌ ఉద్యోగి నరసింహమూర్తి చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడే మృత్యువాత పడ్డాడు. ఆయన స్కూటర్‌లో వస్తుండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొనింది, దీంతో తీవ్రగాయాలతో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా చేరుకుని విచారించి ఆర్టీసీ బస్సును సీజ్‌ చేసి డ్రైవర్‌ మీద కేసు నమోదు చేశారు. ఘటనాస్థలిలో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. కుటుంబీకులు, బంధువులు చేరుకుని బోరున విలపించారు.

ద్రౌపతమ్మకు గాజుల సింగారం

బొమ్మనహళ్లి: బెంగళూరు రూరల్‌లో హొసకోటె దగ్గర శివనపురలోని ఆదిశక్తి మహా సంస్థాన మఠంలోని ఆదిశక్తి ద్రౌపదిదేవి జయంతిలో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని 20 వేల గాజులతో అలంకరించారు. మహాభారతంలో ద్రుపద మహారాజు నిర్వహించిన పవిత్ర యాగకుండం అగ్ని నుంచి ద్రౌపది జన్మించిన జ్ఞాపకార్థం ఈ జయంతిని జరుపుకుంటున్నారు, ధైర్యం, సహనం వంటి ద్రౌపది గుణాలను నేటి యువత, ముఖ్యంగా మహిళలు అలవర్చుకోవాలి అని పీఠాధిపతి ప్రణవానందపురి స్వామి తెలిపారు.

పోట్లాటలో

ఎలుగుబంటికి గాయాలు

తుమకూరు: జిల్లాలోని మధుగిరిలో జరిగిన రెండు ఎలుగుబంట్ల పోట్లాటలో ఓ ఎలుగుబంటి తీవ్రంగా గాయపడింది. మిడిగేసి హోబ్లీ, బిద్రేకెరె గ్రామంలోని ఒక పొలంలో రెండు ఎలుగుబంట్లు పోట్లాడాయి. మూడేళ్ల ఆడ ఎలుగుబంటి గాయాలతో పడిపోయి ఆర్తనాదాలు చేసింది. గ్రామస్తులు అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా సురేష్‌, శాలిని తదితరులు చేరుకుని ఆ భల్లూకాన్ని చికిత్స కోసం వాహనంలో బెంగళూరు బన్నేరుఘట్ట జూపార్క్‌ కు తరలించారు.

నేత్రపర్వంగా రాయర ఊరేగింపు

మైసూరు: ఎంబీ హళ్లి రోడ్డులోని నిర్మాణనగర జంత గల్లిలోని కల్పవృక్ష శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో 355వ రాయర ఉత్తరారాధన మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. రాఘవేంద్రస్వామి వారికి పంచామృతాభిషేకం, పూల అలంకరణ, మహా మంగళ హారతి నెరవేర్చారు. కల్పవృక్ష వాహనం ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement