బనశంకరి: బెంగళూరు నగరంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) గణపతి విగ్రహాలను ప్రతిష్టించడాన్ని పూర్తిగా నిషేధించామని, ప్రజలు పరిసరస్నేహి వినాయకులను ఏర్పాటు చేయాలని జీబీఏ కమిషనర్ మహేశ్వర్‌రావ్ విన్నవించారు. గౌరీ గణేశోత్సవం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం జీబీఏ, నగర పోలీసులు మంగళవారం టౌన్‌హాల్‌లో శాంతి సభను నిర్వహించారు. మహేశ్వర్‌రావ్ మాట్లాడుతూ పీఓపీతో తయారు చేసిన గణపతి విగ్రహాల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని నిషేధం ఉన్నట్లు తెలిపారు. మట్టి వినాయకులనే కూర్చోబెట్టి పూజించాలని కోరారు. గణేశోత్సవానికి అన్ని శాఖలతో చర్చించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రోడ్లు, ఫుట్‌పాత్ మార్గాలు బాగాలేని చోట మరమ్మతులు చేయాలని, పుష్కరిణిలను సిద్ధం చేయాలని తెలిపారు. ప్రజల కోసం అన్నిశాఖల సిబ్బందితో కూడిన సింగిల్ విండో కేంద్రాలను తెరుస్తామని తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు ఆ కేంద్రాల్లో అన్ని అనుమతులు తీసుకోవచ్చని చెప్పారు.
ఉత్సవాలకు గట్టి భద్రత
పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ గణేశోత్సవం శాంతియుతంగా ఆచరించడానికి భద్రత కల్పిస్తామని, ప్రజలకు ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ పెరగవచ్చని, ఊరేగింపులకు అనుకూలమైన మార్గాలను సూచిస్తామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు కార్తీక్‌రెడ్డి, ఆర్.లతా, నవీన్‌కుమార్‌రాజు, అధికారులు, నగరవాసులు పాల్గొన్నారు.
బెంగళూరులో విక్రయాలకు సిద్ధంగా విగ్రహాలు
పాల్గొన్న పోలీస్ అధికారులు, నగర ప్రజలు
అనుమతులకు సింగిల్ విండోలు
పీఓపీ విగ్రహాలు వద్దు
జీబీఏ, పోలీసు అధికారుల వెల్లడి


