రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, శాసన సభ్యులు, అధికారులు అవినీతి అక్రమాల్లో మునిగి పోయారని, అక్రమాల పుట్ట కాంగ్రెస్‌ను ఇంటికి పంపడమే లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని లింగసూగూరులో బీజేపీ ఆధ్వర్యంలో లింగసూగూరు నుంచి బళ్లారి వరకు చేపట్టిన పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని వారు మాట్లాడారు. సర్కార్‌లో మంత్రిగా పని చేసిన నాగేంద్ర రాజీనామా చేసినంత మాత్రాన వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి నిధులను తిరిగి రాబట్టాలని డిమాండ్ చేశారు. ఎస్టీలకు కేటాయించిన ఏడు శాతం రిజర్వేషన్లను 3 శాతానికి తగ్గించారని దుయ్యబట్టారు. కరువు నివారణ విషయంలో నిర్లక్ష్యం, కేపీఎస్సీ బాగోతం, అభివృద్ధి పనుల స్తంభన వంటివి జరిగాయని ఆరోపించారు. పాదయాత్రలో విధాన పరిషత్ సభ్యుడు నారాయణ స్వామి, మాజీ మంత్రులు గోవింద కారజోళ, శ్రీరాములు, అశోక్, శివనగౌడ నాయక్, రాజుగౌడ, విరుపాక్షప్ప, మాజీ ఎమ్మెల్యేలు మానప్ప వజ్జల్, ప్రతాప్‌గౌడ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
బిడదిలో సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం
సరైన వర్షాలు కురవక కరువుతో సతమతమవుతున్న రైతుల సమస్యలను పట్టించుకోకుండా, బిడదిలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. మంగళవారం బీజేపీ నేతలు లింగసూగూరు నుంచి బళ్లారి వరకు చేపట్టిన పాదయాత్రకు ముందు విలేకరులతో మాట్లాడారు. సర్కార్‌లో మంత్రిగా పని చేసిన నాగేంద్ర రాజీనామా చేసి వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అవినీతి చేశారని, దళితులకు కేటాయించిన నిధులను వారికి వ్యయం చేయకుండా దిగమింగారన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప వరదలు వచ్చిన సమయంలో రూ.5 లక్షల పరిహారం అందించారని గుర్తు చేశారు. మాజీ మంత్రి రాజణ్ణ విషయంలో దళితులపై ఎంత మమకారం ఉందో తెలుస్తోందన్నారు. వాల్మీకి అభివృద్ధి మండలి అధికారి చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సాంత్వన చెప్పలేని సర్కార్ గాఢనిద్రలో ఉందని ఎద్దేవా చేశారు. మంత్రివర్గంలో నలుగురు అమాత్యులు త్వరలో తమ పదవులు రాజీనామా చేయడానికి సిద్ధం కావాలన్నారు. 2028లో బీజేపీ నేతృత్వపు ఎన్‌డీఏ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్నారు.
కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు
లింగసూగూరులో పాదయాత్రకు నగారా మోగించిన నేతలు
పాదయాత్ర వేదికపై
మాజీ ముఖ్యమంత్రుల నగారా
లింగసూగూరు నుంచి
పాదయాత్రకు నేతల శ్రీకారం


