సాక్షి, బళ్లారి/హుబ్లీ: అసెంబ్లీ సమావేశాల్లో కరువుపై చర్చకు అవకాశం ఇవ్వని బీజేపీకి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అవసరం లేదు. నాగేంద్ర నైతిక బాధ్యత వహించి ఏ తప్పు చేయక పోయినా రాజీనామా చేశారని సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. హుబ్లీ విమానాశ్రయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ వారి ఆటలన్నింటికీ తాను ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ చెబుతానన్నారు. ఆ సమాధానం ఎలా చెబుతానో త్వరలోనే తెలియజేస్తానన్నారు. బీజేపీలో ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని కప్పి పుచ్చడానికి ఈ పాదయాత్ర చేపట్టారు. కరువుపై చర్చకు బీజేపీకి ఎటువంటి నైతికత లేదు. బీజేపీ పాదయాత్ర చేయడం లేదు. రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కూడా గతంలో బళ్లారికి, మేకెదాటు పథకం కోసం, కృష్ణా నీటి వాటాలపై పాదయాత్రలు చేశామని గుర్తు చేశారు. బీజేపీ 100 పాదయాత్రలు చేయనివ్వండి. వారిపై ఎదురు దాడికి వారే దారి కల్పించారన్నారు. కరువు పీడిత ప్రాంతాలను ఉన్న ఫళంగా తీర్మానించడం కుదరదు. దీనికి ఎన్నో నియమాలు ఉన్నాయి. అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాలి. దాని ఆధారంగా కరువు ప్రాంతాలను ప్రకటిస్తాం. కనకపురలోను కరువు ఉంది. అయినా ఇప్పటికీ ఆ ప్రకటన చేయలేదు. నేను సీఎం అయిన తక్షణమే అధికార దుర్వినియోగం చేయడం కుదరదు. బీజేపీ వారికి నేను సీఎం కావడం జీర్ణం కావడం లేదు. రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేయడమే వారి గొప్పతనం. అయితే రాహుల్ గాంధీ ఏ అవినీతికి పాల్పడ్డారు. కేపీఎస్సీ అక్రమాల్లో పాలు పంచుకున్నారా? ఎన్‌ఈటీ పరీక్ష అక్రమాల్లో పాలు పంచుకున్నారా? అని నిలదీశారు. మంత్రి బసవరాజ రాయరెడ్డి ఏం మాట్లాడారో తనకు తెలియదని, ఆయనతో కలిసి చర్చించాక దానిపై మాట్లాడతానన్నారు.
రాజకీయాల కోసమే పాదయాత్ర
ముఖ్యమంత్రి డీకే.శివకుమార్


