● కేబినెట్ ఉపసంఘం భేటీ
శివాజీనగర: విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆరు ప్రధాన సమస్యలు, విద్యా వ్యవస్థలో అమలు చేయాల్సిన సంస్కరణల గురించి ఆరోగ్య శాఖ మంత్రి యూ.టీ.ఖాదర్ అధ్యక్షతన ఏర్పాటైన విద్యార్థి సమస్యలు– విద్యా సంస్కరణల కేబినెట్ ఉపసంఘం మొదటి సమావేశంలో చర్చించారు. గురువారం విధానసౌధలో ఈ భేటీ జరిగింది. మంత్రులు మధు బంగారప్ప, బసవరాజ్ రాయరెడ్డి, ప్రియాంక్ ఖర్గే, శరణప్రకాష్ పాటిల్, ఐఏఎస్‌లు హాజరయ్యారు. పరీక్షలు, చదువుల ఫీజుల భారం, కోచింగ్ సెంటర్ల నియంత్రణ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యల గురించి చర్చించారు. విద్యారంగంలో మార్పులపై నిపుణుల అభిప్రాయాలను సేకరించాలని, వారితో సమావేశం జరపాలని తీర్మానించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా నిపుణులు, ప్రజల నుంచి విద్యా సంస్కరణలపై సూచనలు స్వీకరించడానికి ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని సూచించారు. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్‌సీ)లో అక్రమాలను అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని మంత్రులు పేర్కొన్నారు.


