సాక్షి,బళ్లారి: ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేక వెలవెలపోతూ ఎడారిని తలపిస్తున్నాయి. ఒకప్పుడు వర్షం నీటితో కళకళలాడిన వేదవతి నది బీటలు వారింది. పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే నీటితో పరవళ్లు తొక్కిన నదులు ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో అడుగంటి దర్శనమిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు రాకపోవడంతో మానవాళికే కాదు, పశుపక్షాదులకు కూడా రోజురోజుకు నీటి సమస్య జటిలం అవుతోంది. ముఖ్యంగా జిల్లాలో ప్రధానంగా ప్రవహించే తుంగభద్ర, వేదవతి నదుల్లో కూడా నీటి సవ్వడులు లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జనం తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. ప్రజలకు తాగునీటి సమస్యే కాకుండా పశుపక్షాదులకు కూడా నీటి కొరత ఏర్పడింది. ఈ ప్రాంతంలో కరువు ఛాయలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సిరుగుప్పను కరువు తాలూకాగా ప్రకటించకపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు.
చెరువుల, నదుల పరిశీలన
గురువారం కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రైతు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పలు గ్రామాలను సందర్శించి రైతులను వెంటబెట్టుకుని తుంగభద్ర, వేదవతి నదులతో పాటు స్థానికంగా ఉన్న చెరువులను పరిశీలించారు. అన్ని చెరువుల్లో చుక్క నీరు లేక బీటలు వారడంతో ఎటు చూసినా బీడు భూములు, బీటలు వారిన చెరువులు కనిపించడంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు తుంగభద్ర డ్యాంలో నీరు తగినంత చేరడంతో డ్యాం నుంచి వేదవతి, తుంగభద్ర నదులకు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చెరువుల్లో కూడా నీరు లేక వెలవెలపోతున్న నేపథ్యంలో తాలూకాలోని అన్ని చెరువులను నీటిని నింపాలని ఒత్తిడి చేశారు.
నేడు సిరుగుప్పలో భారీ నిరసన
తాలూకాలో చెరువులు పూర్తిగా ఎండిపోగా, నదుల్లో చుక్క నీరు లేవని, పెట్టిన పంటలు పూర్తిగా వాడుముఖం పట్టాయని రైతు సంఘం నాయకులు అన్నారు. ఆయకట్టులో పంటలు సాగు చేయడానికి వీలు కావడం లేదన్నారు. కాలువలకు నీరు వదిలినా రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఇలాంటి దుస్థితిలో సిరుగుప్పను కరువు తాలూకాగా ప్రకటించకపోవడం బాధాకరం అన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టేందుకు సిద్ధం అయ్యారన్నారు. ప్రభుత్వం సిరుగుప్పను కరువు తాలూకాగా ప్రకటించాలని, తుంగభద్ర, వేదవతి నదులకు నీరు విడుదల చేయాలన్నారు. లేకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం సాగు, తాగునీటి కోసం రైతులు సిరుగుప్పలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారన్నారు.
తుంగభద్ర, వేదవతి నదులకు నీరు వదలాలి
కర్ణాటక ప్రాంత రైతు సంఘం నేతల డిమాండ్


