సాక్షి,బళ్లారి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న పాఠశాలను మందుల బాబులు అడ్డాగా మార్చుకున్నారు. పాఠశాలకు భద్రత కొరవడంతో ప్రతి రోజు పొద్దుమునిగితే చాలు ఆ గ్రామంలో మందుబాబులు కొందరు పాఠశాల ఆవరణలోని వరండాలోనే యథేచ్చగా మందు తాగి అక్కడే బాటిళ్లు విసిరి పారేసి వెళుతున్నారు. బళ్లారి తాలూకా మోకాలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్(కేపీఎస్) ప్రభుత్వ పాఠశాల ఆవరణ మందు బాబులకు అడ్డాగా మారింది. సెలవు రోజుల్లో పాఠశాల ఆవరణలో మందు తాగుతున్నారనుకుంటే పొరపాటు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటి నుంచి పాఠశాల ఆవరణలో నిత్యం రాత్రి వేళల్లో స్థానికులు కొందరు మందు బాటిళ్లు తీసుకొని వచ్చి అక్కడే పార్టీలు చేసుకొని విచ్చలవిడిగా మజా చేస్తున్నారు. ఉదయం విద్యార్థులు వచ్చిన తర్వాత ఆ మందు బాటిళ్లను చూసి నివ్వెర పోతున్నారు. ఈ పాఠశాలలో దాదాపు 1200 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
అధికారులకు ఫిర్యాదు చేసిన కరవే
గ్రామంలో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందిన మోకాలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో బీర్, బ్రాందీ, విస్కీ తదితర బాటిళ్లు తరగతి గదుల ముందే తాగి వదిలిపెట్టి వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్థానికులు, పాఠశాల యాజమాన్యం ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో బుధవారం కర్ణాటక రక్షణ వేదిక నారాయణ గౌడ వర్గానికి చెందిన బళ్లారి గ్రామీణ కరవే అధ్యక్షుడు పంపనగౌడ ఆధ్వర్యంలో పాఠశాలలో మందు బాబులు పాల్పడుతున్న అసాంఘిక కార్యకలాపాలపై స్థానిక పోలీసు అధికారులకు, జిల్లా విద్యాశాఖ అధికారికి, జెడ్పీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామంలోని పాఠశాలలో మందుబాబులు చేస్తున్న అరాచకాలను అరికట్టాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పాఠశాల వరండాలో తాగి వదిలేసిన ఖాళీ మందు బాటిళ్లు
మోకాలోని కర్ణాటక పబ్లిక్ పాఠశాల ప్రవేశ ద్వారం
మందుబాబుల అడ్డాగా
ప్రభుత్వ పాఠశాల
వరండాలోనే యథేచ్ఛగా
మద్యం తాగుతున్న తాగుబోతులు


