హొసపేటె: ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఏఐడీఎస్‌ఓ) విజయనగర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తాలూకా కార్యాలయం ముందు భారీ నిరసన చేపట్టారు. నీట్–యూజీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, అవినీతికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన అమానుష లాఠీచార్జి, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్ వాడకం, షాక్‌బటన్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు. నిరసన అనంతరం తహసీల్దార్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. నిరసనలో జిల్లా అధ్యక్షుడు రవికిరణ్ మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన అఘాయిత్యాలపై, ఎన్‌టీఏ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐడీఎస్‌ఓ జిల్లా కార్యదర్శి యూ.ఉమాదేవి వైష్ణవి, సయ్యద్ సమీర్, మీనాక్షి, నిర్మల శ్రీనివాస్, హులిగెమ్మ, విద్యాశ్రీలతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


