●45 వేల క్యూసెక్కుల నీరు విడుదల
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి ఆల్మట్టి డ్యాంకు వరద కొనసాగుతుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. బుధవారం ఆల్మట్టి డ్యాం నుంచి 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఉత్తర, కల్యాణ కర్ణాటకలోని నదీ తీర జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఆల్మట్టి డ్యాం గరిష్ట నీటిమట్టం 519.60 మీటర్లు కాగా ప్రస్తుతం 517.78 మీటర్ల మేరకు నీటిమట్టం చేరింది.
పెంచిన ఫీజులను తగ్గించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర సర్కార్ రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం ఉన్నఫళంగా పెంచిన ఫీజులను తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బుధవారం రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయంలో చేపట్టిన ఆందోళనలో విద్యార్థులు మాట్లాడారు. గతంలో ఫీజు రూ.18,350 ఉండగా ప్రస్తుతం దానిని రూ.25,350లకు పెంచడాన్ని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వర్సిటీలో మౌలిక సౌకర్యాలు కల్పించకుండా అధిక పీజులు చెల్లించడం కష్టమని, వానలు లేక కరువు నెలకొన్న సమయంలో పెద్ద మొత్తంలో ఫీజులు కట్టడం భారమని పేర్కొంటూ ఆందోళన చేపట్టారు.
పీహెచ్‌సీల్లో సిబ్బందిని నియమించరూ
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని నియమించాలని మాదిగ దండోరా సమితి డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ధూళయ్య మాట్లాడుతూ గుంజహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుల కొరత ఉందని తెలిపారు. రాయచూరు– మంత్రాలయం జాతీయ రహదారి కావడంతో అధికంగా సిబ్బందిని నియమించాలని కోరుతూ డీహెచ్‌ఓ నందితకు కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు. రంజిత్, హన్మంతు, జక్రప్ప పాల్గొన్నారు.
గ్రామాల్లో నీటి ఎద్దడి రానీయొద్దు
రాయచూరు రూరల్: ఈసారి సరైన వర్షాలు లేనందున గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చొరవ చూిపి, సహకరించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం అరకెర తాలూకా నాగడదిన్నిలో తాగునీటి చెరువులను పరిశీలించిన అనంతరం అధికారులతో ఆయన మాట్లాడారు. సింధనూరు, మాన్వి, రాయచూరు తాలూకాతో పాటు నగర ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని సూచించారు.
అక్రమ బియ్యం బస్తాల పట్టివేత
రాయచూరు రూరల్: పేదలకు పంచాల్సిన అన్న భాగ్య బియ్యం నల్ల బజారుకు తరలిస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్న ఉదంతం యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం సురపుర తాలూకా గోగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉక్కినాళలో అక్రమంగా గోదాములో 202 బస్తాల్లో నిల్వ చేసిన 81.75 క్వింటాళ్ల బియ్యాన్ని ఆహార పౌర సరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్ సంజీవ్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ చంద్రనాథ్ దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.89 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.


