రాయచూరు రూరల్: జిల్లాలో రక్తదాన శిబిరాలపై జన జాగృతి అవసరమని జిల్లా ఆరోగ్య శాఖాధికారిణి నందిత పేర్కొన్నారు. బుధవారం రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల పరిశోధన సంస్థలో జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్య శాఖ, రిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికెళ్లి అత్యవసర సమయంలో యువత రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, లాభాలపై ప్రజలను జాగృతం చేయాలన్నారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రక్తదానం చేయాలన్నారు. కార్యక్రమంలో రిమ్స్ అధికారి రమేష్, రవీంద్ర జాలదార్, యశోద, అహ్మద్ హుసేన్, శ్వేతాంబరి, ఫౌజియా, ఈశ్వర్, లోకేష్, బసయ్య, సంధ్య, సరోజలున్నారు.
పాత్రికేయులకు క్రికెట్ పోటీలు
హొసపేటె: నగరంలోని డీఏఆర్ మైదానంలో బుధవారం విలేకరులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. విజయనగర జిల్లాధికారిణి కవిత ఎస్. మన్నికేరి, ఏఎస్పీ మంజునాథ్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. టాస్ వేసి జిల్లాధికారిణి బ్యాటింగ్ ప్రారంభించగా, ఏఎస్పీ బౌలింగ్ చేశారు. పాత్రికేయులు రెండు జట్లుగా ఏర్పడి క్రికెట్ టోర్నీ ఆడారు. ఒక జట్టుకు జయప్ప రాథోడ్, మరో జట్టుకు శివానంద్ నాయకత్వం వహించి నేరుగా మ్యాచ్ ఆడారు. శివానంద్ నాయకత్వంలోని జట్టు విజేతగా నిలవగా, జయప్ప నాయకత్వంలోని జట్టు రన్నరప్‌గా నిలిచింది.
మౌలిక సౌకర్యాల కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం దేవదాసి మహిళలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర దేవదాసి మహిళల విమోచన సంఘం డిమాండ్ చేసింది. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. దేవదాసి మహిళలకు పునర్వసతి కల్పించడంలో ఆలస్యం, 206 మంది మాజీ దేవదాసి మహిళలకు నివాసాలు కల్పించడంలో నిర్లక్ష్యం తగదన్నారు. రూ.లక్ష నిధులు విడుదల చేయాలని, పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఐదు ఎకరాల భూమి, పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.6 వేలకు పెంచాలని, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో వీరేష్, మహాదేవి, జమ్ములమ్మ, సంతోషమ్మ, సరోజమ్మ, తిప్పమ్మ, రవి, బసంతి, ఆనంద్, బడెమ్మ, నాగమ్మ, భీమేష్‌లున్నారు.
ఫ్యాక్టరీ విస్తరణకు
వ్యతిరేకంగా రైతుల ధర్నా
హొసపేటె: బల్డోటా ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన హింసాత్మకంగా మారింది. కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉన్నప్పటికీ వందలాది మంది రైతులు ఫ్యాక్టరీ ప్రాంగణంలోని గోడలు, గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు. నిరసన సందర్భంగా రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ రామ్ ఎల్., అదనపు జిల్లా కలెక్టర్ హేమంత్ కుమార్‌తో సహా ఉన్నతాధికారులు ఘటన స్థలంలో ఉన్నప్పటికీ నిరసనకారులు ప్రాంగణంలోకి ప్రవేశించారు. అదే సమయంలో ఒక యువకుడు బసాపుర చెరువులోకి దూకగా, పోలీసులు వెంటనే అతడిని రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఉన్న బసాపుర చెరువును ప్రజల వినియోగం కోసం తెరవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
చోరీ సొత్తు
సొంతదారులకు అప్పగింత
హొసపేటె: గత ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 వరకు జిల్లాలో 352 ఆస్తి దొంగతనాల కేసులు నమోదు కాగా వాటిలో 150 కేసులను గుర్తించి మొత్తం రూ.4.57 కోట్ల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బళ్లారి రేంజ్ ఐజీ హర్ష పేర్కొన్నారు. ఆయన మంగళవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాధీనం చేసుకున్న సొత్తును సొంతదారులకు అప్పగించి మాట్లాడారు. దోపిడీ కేసుల్లో రూ.3.32 లక్షలు, దొంగతనం కేసుల్లో రూ.29,63,300, పగటి పూట దొంగతనం కేసుల్లో రూ.53.33 లక్షలు, రాత్రిపూట దొంగతనం కేసుల్లో రూ.1,04,434, గృహ దోపిడీ కేసుల్లో రూ.1,57,08,809ల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు వెల్లడించారు.


