● ఆహార, ఔషధ శాఖల తనిఖీలు
మనం నిత్యం ఆరగించే ఆహారం రుచిగా ఉండడమే కాదు శుచిగా కూడా ఉండాలి. అప్పుడే ఆకలి తీరడంతో పాటు ఆరోగ్యానికీ మంచిది. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవనంలో రోడ్ల పక్కన హోటళ్లలో కడుపు నింపుకొనేవారే ఎక్కువ. అలాంటి హోటళ్లలో ఆహారాన్ని ఎంత శుభ్రంగా వండి వారుస్తున్నారనేది పెద్ద ప్రశ్న. నిజంగా శుభ్రతా, నాణ్యత నిబంధనలను పాటిస్తున్నారా? అనేది అడిగినా చెప్పరు. ఈ నేపథ్యంలో హోటళ్లు, క్యాంటీన్లలో ఆహార భద్రతా విభాగం తనిఖీలను ముమ్మరం చేసింది.
శివాజీనగర: ఇటీవల రోజుల్లో హోటళ్లలో భోజనం, అల్పాహారం ఆరగించేవారు పెరిగిపోయారు. బెంగళూరులో ఏ హోటల్‌కు వెళ్లినా కిటకిటలాడుతూ ఉంటుంది. డిమాండ్ ఉండడంతో వేడి వేడి అల్పాహారం, చిరుతిండ్లను వడ్డించే క్యాంటీన్లు, హోటల్‌లు, కెఫెలు అధికమయ్యాయి, ఆహార ప్రియులు ఇటువంటి హోటల్‌లకు వెళ్లి తమకు ఇష్టమైన ఆహారాన్ని సేవిస్తారు. అయితే హోటల్ ఆహారం ఎంతవరకు సురక్షితమనేది వారికి తెలియదు. అంత ముఖ్యమైనది కూడా అనుకోరు.
కృత్రిమ రంగుల సమస్య
నిషేధించిన రంగులను ఆహారం తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కేక్‌లు, లడ్డూ మిఠాయిల వాడకంలో ఇది సమస్యగా తయారైంది. కృత్రిమమైన రంగుల మిఠాయిలను తినడం వల్ల పిల్లల్లో బుద్ధి మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు గతంలో పలు నివేదికలు హెచ్చరించాయి.
పదే పదే అదే నూనె
ఇక ఉపయోగించిన వంటనూనెనే పదే పదే వాడడం జరుగుతోందని ఆరోపణలున్నాయి. వంట నూనెల ధరలు పెరగడంతో ఆహార తయారీదారులు ఈ పద్ధతికి అలవాటుపడ్డారు. ఇది ప్రజల ఆరోగ్యానికి వినాశకారిగా మారుతోంది. వాడిన నూనెనే మళ్లీ వాడడం వల్ల క్యాన్సర్లు, కాలేయ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు గతంలోనే హెచ్చరించారు.
టేస్టింగ్ సాల్ట్ వినియోగం
ఆహారంలో ఎక్కువగా రుచిగా ఉండాలని అధిక మొత్తంలో టేస్టింగ్ సాల్ట్‌లు, పౌడర్‌లను వాడుతారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. చాలా రోజులుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి ఇవ్వడం, నాణ్యత లేని పదార్థాలను ఉపయోగించడం ఇలా అనేక ఆరోపణలు ఆహార తయారీదారులపై ముసురుకొన్నాయి. దీంతో ఆరోగ్య శాఖ, ఆహార సురక్షిత, ఔషధ పరిపాలనా శాఖలు హోటళ్లలో తనిఖీలను ముమ్మరం చేశాయి.
వ్యాపారులకు అవగాహణ
ఆహార భద్రతా అధికారులు రాష్ట్రంలో గత రెండేళ్లలో హోటళ్లలో నాణ్యత తనిఖీలు చేపట్టి 3,505 శాంపిళ్లను సేకరించి విశ్లేషించారు. ఆహార సురక్షిత, నాణ్యత, శుభ్రత గురించి 33,453 హోటళ్లు, క్యాటరింగ్ వ్యాపారులకు శిక్షణనిచ్చారు. ఆహార సురక్షత, నాణ్యత స్థాయి చట్టం– 2006ను ఉల్లంఘించిన 75 ఆహార వ్యాపారులకు భారీమొత్తాల్లో జరిమానాలు విధించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
వంట నూనెను పదే పదే వేడి చేసి ఉపయోగించరాదని 2024 మార్చిలో హోటళ్లకు, ప్రజలకు సూచన చేసినట్లు ఆహార సురక్షత విభాగం తెలిసింది. వాడిన నూనెను మళ్లీ ఉపయోగించకుండా అడ్డుకోవడానికి రాష్ట్రంలో 2022 నుంచి ఇప్పటివరకు హోటళ్ల నుంచి 62 లక్షల లీటర్ల వాడిన వంట నూనెను సేకరించారు. టేస్టింగ్ సాల్ట్‌ను చాలా తక్కువ మోతాదులోనే వాడాలని నిబంధనలను విధించారు.


