శ్రీనివాసపురం: తాలూకాలోని రోణూరు వైకుంఠపురంలో అర్జున ప్రతిష్టిత శ్రీనివాస శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. అర్చకులు ఉదయం నుంచి స్వామివారి మూలవిరాట్టుకు, ఉత్సవ విగ్రహాలకు పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయం ముందున్న రథ వీధిలో తేరును లాగారు. భక్తులు తేరు మీదకు దవనం, అరటి పండ్లు విసిరారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు పానకం, పెసర బేడలు, మజ్జిగ పంచారు.
హంతక హిప్పో
పిల్ల మృత్యువాత
శివమొగ్గ: గత మార్చి 19న శివమొగ్గ జిల్లా త్యావరకొప్ప జూ పార్క్‌లో ట్రైనీ వెటర్నరీ డాక్టర్ సమీక్షా రెడ్డిపై గర్భంతో ఉన్న నీటి ఏనుగు (హిప్పో పోటామస్) దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సమీక్షా రెడ్డి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మరణించారు. తాజాగా ఈ నీటి ఏనుగుకు జన్మించిన పిల్ల నీటి ఏనుగు మరణించింది. హంసిని అనే పేరు ఉన్న తల్లి హిప్పో గతంలో రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అవి కూడా కొన్నిరోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందాయి. మూడో పిల్ల అయినా బతికి బట్టకడుతుందని జూ అధికారులు ఆశపడ్డారు. అయితే అది కూడా చనిపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి.
యువతి మరణించి..
వెలుగులు పంచి..
యశవంతపుర: ప్రమాదంతో బ్రెయిన్‌డెడ్ అయిన యువతి అవయవాలను తల్లిదండ్రులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన హాసన్ జిల్లాలో జరిగింది. అరసికెరె తాలూకా కారేహళ్లికి చెందిన మోనిక (18) ద్వితీయ పీయూసీ పరీక్షలు రాసింది. 5న సాయంత్రం బీహెచ్ రోడ్డు ఎపిఎంసి మార్కెట్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఆమెకు తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం బ్రెయిన్‌డెడ్ అయిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల వినతి మేరకు మోనిక తల్లిదండ్రులు అవయదానానికి అంగీకరించారు. గుండె, కళ్లు, కిడ్నీలు వంటి ముఖ్యమైన అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు పంపించారు. ఆమె వల్ల పలువురికి కొత్త జీవితాలు దక్కాయి.
రోడ్డుపై నుంచి కారు పల్టీ
● కుటుంబానికి గాయాలు
తుమకూరు: నగరం నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న వంతెన పై నుంచి గుంతలో కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలు, వారి ఇద్దరు కూతుళ్లు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు బాగా ధ్వంసమైంది. నగరంలోని హనుమంతపురలో జాతీయ రహదారి– 48 పై నిర్మాణంలో ఉన్న వంతెన మీద ఆదివారం ఉదయం 11 గంటలప్పుడు వెళ్తుండగా అదుపుతప్పి కింద పడిపోవడంతో జనం వెంటనే పరుగులు తీసి బాధితులను బయటకు తీసి రక్షించారు. క్షతగాత్రులను సిద్ధగంగా ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల నుంచి ఈ వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు కూడా లేవు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కళ్యాణ కర్ణాటకకు మేలు
దొడ్డబళ్లాపురం: ఆర్టికల్ 371జే సవరణ వల్ల కళ్యాణ కర్ణాటక ఎంతో అభివృద్ధి చెందుతోందని అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. బీదర్‌లో రాష్ట్ర 40వ పాత్రికేయుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆర్టికల్ 371జే వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక నిధులు, అవకాశాలు, స్థానికులకు ఉద్యోగాలు అన్నీ లభిస్తున్నాయన్నారు. పాత్రికేయులు సమాజంలో అసమానతలు తొలగేలా, అందరికీ న్యాయం జరిగేలా వార్తలు రాయాలని, నిజాన్ని నిర్భయంగా తెలియజేయాలని సూచించారు.


