కోలారు: ఎంత దర్జాగా లంచం తీసుకుంటారో, దొరికిపోతామని తెలిస్తే అంతే భయంతో పరుగులు తీస్తారు. అలాంటి ఘటన కోలారు జిల్లాలో జరిగింది. లంచం తీసుకుంటున్న కోలారు అసిస్టెంట్ డ్రగ్ కంట్రోల్ అధికారి జె.శ్యామల లోకాయుక్త పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కారులో పరారు అవుతుండగా సినిమాలో మాదిరిగా వెంబడించి అరెస్టు చేశారు. వివరాలు.. ఓ మెడికల్ షాపు యజమాని షాపును మరోచోటుకు మార్చాల్సి వచ్చింది. ఇందుకు చిరునామా మార్పు, ఇతరత్రా అనుమతుల కోసం అధికారి శ్యామలను కలిశాడు. అనుమతులు ఇవ్వడానికి రూ.35 వేలు లంచం ఇవ్వాలని ఆమె కోరారు. గురువారం లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త పోలీసులు దాడి జరిపారు. కారులో నుంచే లంచం స్వీకరిస్తున్న ఆమెను అరెస్టు చేయబోగా వెంటనే పరారయ్యారు. అయితే లోకాయుక్త పోలీసులు సుమారు 15 కిలోమీటర్లు కారును వెంబడించి శ్యామలతో పాటు కారు డ్రైవరును అరెస్టు చేశారు.


