బళ్లారిలో ఉగాది పచ్చడి రుచి చూస్తున్న మహిళలు
రాయచూరు రూరల్: పూజలు చేస్తున్న దృశ్యం
సాక్షి, బళ్లారి: హిందువుల ప్రధాన పండుగల్లో ఒక్కటైన ఉగాది పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే కోలాహలం మొదలైంది. ఆలయాలకు వెళ్లి పూజలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు. మామిడి తోరణాలు, వేప ఆకులను ఇళ్లకు కట్టి ఉగాదికి స్వాగతం పలికారు. వేపపువ్వు, బెల్లం, చింతపండు, మిరప, ఉప్పు, మామిడి కాయలతో షడ్రుచుల ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ఇంటిల్లి పాది ఆరగించారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో పూలు, పండ్లకు డిమాండ్ ఏర్పడింది. నగరంలో బెంగళూరు రోడ్డు కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ఉగాది పండుగ రోజున గణపతి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్న నేపథ్యంలో గణపతి ఆలయాల వద్ద భక్తులు సందడి నెలకొంది. పలువురు ఆలయాలు వద్ద కూడా ఉగాది పచ్చడి పంపిణీ చేసి మన సంప్రదాయాన్ని కాపాడటం విశేషం.
రాయచూరు రూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త దుస్తులు ధరించి ఉగాది పచ్చడిని పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. హిందూ జన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో రాజేంద్ర కుమార్ బ్రహ్మధ్వజ పూజలు చేపట్టారు. వీరభద్రేశ్వరుడి దేవాలయం, కిల్లే బృహన్మఠం, లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో అర్చకులు పంచాంగ శ్రవణం వినిపించారు. మంత్రాలయంలో సుబుదేంద్ర తీర్థు శ్రీ పాదంగల్ ప్రత్యేక పూజలు జరిపారు. చైత్రమాసం పాడ్యమి రోజు నాగలి పట్టి దున్నితే మంచి పంటలు చేతికొస్తాయని పూర్వీకుల నుంచి నమ్మకం ఉండటంతో పలువురు పొలాల్లో సేద్యం చేశారు.
పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం
ఆలయాల్లో పంచాంగ శ్రవణాలు


