సాక్షి బళ్లారి: కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా హంపీ–అంజనాద్రి దేవాలయాల్లో పూజలు చేయించేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. ప్రమాదవశాత్తూ కారు అదుపు తప్పి బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందారు. శనివారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కూడ్లిగి తాలూకా హైవేలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బెంగళూరులోని సుబ్బణ్ణపాల్యకు చెందిన శ్రీనివాస రావు, రత్నాబాయి దంపతుల కుమారుడు రూపేష్ పుట్టిన రోజు సందర్భంగా హంపీ–అంజనాద్రి దేవాలయాల్లో పూజలు చేయించాలని బయలుదేరారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కూడ్లిగి తాలూకా హైవేలో వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస రావు (70), రత్నాబాయి (65) ఇద్దరు మృతి చెందగా వీరితో పాటు ప్రయాణిస్తున్న కుమారుడు రూపేష్ (37), కవిత బాయి (33) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కూడ్లిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో కుమారుడు రూపేష్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఘటనా స్థలంలో కారు దూరంగా ఎగిరి పడిపోవడంతో స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కూడ్లిగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కూడ్లిగి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారు బోల్తా: ఇద్దరు మృతి


