సాక్షి బళ్లారి: పవిత్ర పుణ్యక్షేత్రాలు కొలువుదీరిన పుణ్యభూమి కిష్కింధ. సాక్షాత్తు ఆంజనేయ స్వామి జన్మించిన స్థలం. పరమ శివుడు లింగం రూపంలో స్వయంభువుగా వెలసిన పవిత్ర క్షేత్రంగా కిష్కింద బాసిల్లుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. ఇలాంటి కిష్కింధ అందాలను జీవితంలో ఒకసారైనా చూసి రావాల్సిందే మరి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ విరుపాక్షేశ్వర స్వామి స్వయంభువుగా కొలువుదీరడంతో పాటు కిష్కింధ ప్రాంతంలోని అంజనాద్రి కొండలో ఆంజనేయ స్వామి జన్మించారని భక్తుల విశ్వాసం. గంగావతి–హంపీ మధ్య అత్యంత సుందర, సువిశాల ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని కిష్కింధగా పిలుస్తారు. ఈ ప్రాంతం చుట్టుపక్కల పచ్చని పంట పొలాలు, తుంగభద్ర నది నిరంతరం పారే సెలయేరు, తుంగభద్ర డ్యాం నుంచి నది పొడవునా ఎత్తయిన రాతి కొండలు కనిపిస్తాయి. తుంగభద్ర నదికి ఇరువైపులా సాగు చేసిన పచ్చని పంట పొలాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కిష్కింధ ప్రాంతంలో కొప్పళ జిల్లా గంగావతి తాలూకా ఆనెగొంది ప్రాంతంలో ప్రకృతి ఒడిలో కనిపించే సుందర మనోహర దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రకృతి ఒడిలో సుందర దృశ్యాలు, కొండల మధ్య పారే నీరు, ఎంత చూసిన తనివి తీరని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా కిష్కింధ చరిత్ర పుట్టల్లో నిలిచిపోతోంది.
పెరిగిన పర్యాటకుల తాకిడి
కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, కలకత్తా, తదితర ప్రాంతాలతో పాటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో కిష్కింధ ప్రాంతానికి కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తున్నారు. ఆంజనేయ స్వామి జన్మించిన అంజనాద్రి కొండను దర్శించుకుని భక్తులు పునీతులవుతుంటారు. హంపీ స్మారకాలను వీక్షించే పర్యాటకులందరూ కిష్కింధను సందర్శిస్తారు. విజయనగర కాలం నాటి కట్టడాలు, శిఖరాలు, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాన్ని వీక్షించవచ్చు. హంపీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించే శిలల నిర్మాణం ఓ వైపు ఆకర్షణగా నిలుస్తుండగా ఈ ప్రాంతం ఫొటోగ్రఫీ ప్రియులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తుంగభద్ర నదిలో పడవ విహారం, కిష్కింద ప్రాంతంలోని కనిపించే కొండలు, రాళ్ల నిర్మాణాలు, చరిత్రాత్మక కట్టడాలు చూస్తే కలిగే అనుభూతి చెప్పలేనిది. ఇక హంపీ–కిష్కింద ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి. పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తుండటంతో ఎటుచూసిన పచ్చదనం కనిపిస్తోంది.
కిష్కింధలో వెలసిన అంజనాద్రి కొండ
సెలయేరు అందాలు
పవిత్ర పుణ్యక్షేత్రాలు కొలువుదీరిన పుణ్యభూమి కిష్కింధ
ఆకట్టుకునే రాతి నిర్మాణాలు,
చరిత్రాత్మక కట్టడాలు
దేశ, విదేశీ పర్యాటకుల సందడి


