హొసపేటె: దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. రంగు రంగుల ఈ పండుగలో ప్రజలంతా పాల్గొని రంగులు చల్లుకుని సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. బుధవారం హంపీలో ఎక్కడ చూసినా ప్రజలంతా హోలీ ఆడి రంగులు పూసుకుని సంబరాల్లో మునిగి తేలారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల నడుమ కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ సంతోష క్షణాలను పూర్తిగా ఆస్వాదించారు. ఇలాంటి కలర్‌ఫుల్ హోలీ పండుగను ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీలో బుధవారం ఎంతో ఘనంగా జరుపుకొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు హంపీలో ఒకరి కొకరు ముఖానికి రంగులు పూసుకొని, ఒంటి మీద రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు. హోలీ సంబరాలను హంపీలోని విరుపాక్ష దేవాలయం నుంచి ఎదురు బసవణ్ణ మంటపం వరకు గల ప్రధాన వీధిలో నిర్వహించారు. స్థానికులు విదేశీ పర్యాటకులతో కలిసి నృత్యాలు చేశారు. హోలీ పండుగ ముందు రోజు కామన దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా జిల్లా ఎస్పీ జాహ్నవి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
హొసపేటెలో..
నగరంలో బుధవారం హోలీ సంబరాలు ఆకాశాన్నంటాయి. చిన్న, పెద్ద, యువతీ యువకులు ఎంతో ఇష్టపడే ఈ హోలీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకొన్నారు. విజయనగర జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగను ప్రజలు తమ తమ ప్రాంతాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకరికొకరు రంగులు చల్లుకొని ఉత్సాహంగా ఆచరించారు.
సంబరాల్లో పాల్గొన్న
స్వదేశీ, విదేశీ
పర్యాటకులు
పరస్పరం రంగులు పూసుకుని
ఆనందించిన వైనం


