హొసపేటె: రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి స్థలంలోనే మృతి చెందిన ఘటన బుధవారం నగరంలో జరిగింది. నగరంలోని పటేల్ నగర్ వార్డు గోపీనాథ్ పాఠశాల రోడ్డులో అతి వేగంగా వస్తున్న బైక్ ఎదురుగా వస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నగరానికి చెందిన వీరాంజనేయ(46) అనే స్కూటీ చోదకుడి తలకు బలంగా దెబ్బ పడటంతో తీవ్ర రక్తస్రావంతో స్థలంలోనే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న ఇద్దరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
పాఠశాలలో హెచ్‌ఎం
రెండో భార్య హైడ్రామా
సాక్షి బళ్లారి: కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా సోమలాపుర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడి రెండో పెళ్లి వివాదం కలకలం రేపింది. బుధవారం ప్రధానోపాధ్యాయుడు సిద్దేశ్ శెట్టర్ వ్యక్తిగత వివాదం పాఠశాల ఆవరణలో వెలుగులోకి రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్‌ఎం రెండో పెళ్లి చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఉండటంతో తన భర్త తన వద్దకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగడంతో పాఠశాలలో ఉద్రిక్తత ఏర్పడింది. పాఠశాలలోని తరగతి గదిలో విద్యాబోధన చేస్తున్న సమయంలో ఆమె ఆక్కడికి చేరుకొని తన ఇంటికి ఎందుకు రావడం లేదని ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి వ్యక్తిగత వ్యవహారంపై పాఠశాల తరగతి గదిలో రచ్చ చేయడం సరి కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్‌ఎం రెండో పెళ్లి వివాదం చర్చనీయాంశమైంది. ఘటనపై విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు, తోటి ఉపాధ్యాయులు సర్దిచెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించారు.
6న మద్యపాన
ముక్త భారత్‌పై సదస్సు
రాయచూరు రూరల్: మద్య పాన ముక్త భారత్‌పై ఈనెల 6న సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ రమేష్ వెల్లడించారు. బుధవారం కళాశాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నగరంలోని ఎస్పీ క్రీడా మైదానంలో నశా ముక్త భారత్ పేరుతో రాజీవ్ గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు ప్రచార శిబిరం, మారథాన్‌ను మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్, రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ భగవాన్ ప్రారంభిస్తారన్నారు. మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, బోసురాజు, శాసన సభ్యులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు.
ముత్యాపై వీడియోలు
అప్‌లోడ్ చేయొద్దు
రాయచూరు రూరల్: స్వయం ప్రకటిత దేవమానవ మల్లికార్జున ముత్యాపై ప్రజలు వీడియోలు, ఆడియోలను అప్‌లోడ్ చేయరాదని, అలా చేసిన వారిపై కేసులు తప్పవని యాదగిరి జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల క్రితం దైవవాణిని వినిపించే ముత్యా బాలికపై అనుచితంగా ప్రవర్తించినట్లు వీడియోను వైరల్ చేయడంపై మహిళా శిశు సంరక్షణ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. యాదగిరి జిల్లా శహాపుర తాలూకా మహల్ రోజా మల్లికార్జున ముత్యాపై కమిషన్ సుమోటో కేసు నమోదు చేసుకుందని తెలిపారు. ముత్యాపై అసత్యపు ఆరోపణలు చేయడం మానాలని, అనవసరంగా కేసులను నమోదు చేయడంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాటికాపరులకు పెన్షన్ ఇవ్వరూ
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల మాదిరిగా కాటికాపరులకు కనీస వేతనాలు, పెన్షన్ చెల్లించాలని కాటికాపరుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనం వద్ద సంఘం అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. అసంఘటిత రంగంలో విధులు నిర్వహించే కాటికాపరులకు నెలకు రూ.10 వేల వరకు పెన్షన్ చెల్లించేలా సర్కార్ బడ్జెట్‌లో నిధులు ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.


