హొసపేటె: షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మికులకు కనీస వేతనాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) నేతృత్వంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బళ్లారి రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్.బసవరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నాలుగు కార్మిక చట్టాల్లో కార్మికులకు ఉద్యోగ భద్రత లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత కొత్త కోడ్‌లను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం నేతలు యల్లాలింగ, ఆర్.భాస్కర్ రెడ్డి, నాగరత్న తదితరులు పాల్గొన్నారు.
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం కార్మిక శాఖ జిల్లాధికారి కార్యాలయం వద్ద సంఘం అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. వేతనాలు చెల్లించేలా సర్కార్ బడ్జెట్‌లో ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలని కోరుతూ జిల్లా కార్మిక శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు.


