శివాజీనగర: ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్న డిప్యూటీ సీఎం డీ.కే.శివ కుమార్ సహనంతో ఉంటాననే చెబుతున్నారు. హైకమాండ్ కూడా అదే మాటను ఆయనకు చెబుతోంది, పలు రాష్ట్రాల శాననసభ ఎన్నికలు ముగిసేవరకూ వేచి ఉండాలని డీకేను సూచించినట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఓపికతో ఉంటానని, మాట తప్పితే తీవ్ర నిర్ణయాలు తప్పవని డీకే స్పష్టం చేసినట్లు సమాచారం. కొన్నిరోజులు ఘాటుగా ప్రకటనలు చేసిన సీఎం సిద్దరామయ్య అంతలోనే స్వరం మార్చడం గమనార్హం. డీ.కే.శివకుమార్, తన బంధం పాలు–తేనెలాంటిదని, డీకేని ఆకర్షించేందుకు బీజేపీ, జేడీఎస్ పగటి కలలు కంటున్నాయని చెప్పడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
అసోం పరిణామాలు
అసోం అసెంబ్లీ ఎన్నికలకు డీ.కే.శివకుమార్ ఇన్‌చార్జిగా ఉన్నారు, అసోంలో ఒకప్పటి కాంగ్రెస్ నేత అయిన హిమంత్ బిశ్వశర్మ బీజేపీలో చేరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. డీకే ఎక్కువకాలం అసోంలో ఉంటే అనుకోని పరిణామాలు జరిగే అవకాశాలున్నాయా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్ కాంగ్రెస్‌కు కట్టుబడిన నాయకుడు, బీజేపీ ఆయనను జైలులో ఉంచి వేధించినా పార్టీకి విధేయునిగా ఉన్నారు అని సిద్దరామయ్య మెచ్చుకోవడం వెనుక ఏ లెక్కాచారం ఉందీ? అనేది రాజకీయ వర్గాల్లో ఉత్సుకతగా ఉంది.
అసహనం వెంటాడుతున్నా..
అప్పట్లో ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల తరువాత సిద్దు సీఎం పదవిని వదిలి తనకు పట్టం కట్టాలని డీకే డిమాండ్ చేస్తున్నారు. అయితే సిద్దరామయ్య పట్టుదల, హైకమాండ్ నాన్చివేత వల్ల డీకే కల నెరవేరడం లేదు. హైకమాండ్ మీద డీకే అసహనంతో ఉన్నా, బయటకు చెప్పడం లేదు. తాము శ్రమించి పెంచిన పార్టీని నాశనం చేయడానికి మనసు రాదని తెలిపారు. సిద్దరామయ్యతో పాలు–తేనె బంధముందా అంటే బలవంతంగా ఔను అంటున్న డీకేలో అసంతృప్తిలో అధికమవుతోందని సమాచారం. అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత సీఎం పదవిని అప్పగించాలి, లేదంటే తీవ్ర నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చని డీకే హైకమాండ్ పెద్దలకు తెలిపినట్లు తెలిసింది. డీకే శివకుమార్, సిద్దరామయ్య కలసికట్టుగా ఎన్నికలకు వెళితే రాష్ట్రంలో 140కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాగడి ఎమ్మెల్యే హెచ్.సీ.బాలకృష్ణ అన్నారు. సీఎం సీటు వివాదం వల్ల పార్టీకి హాని కలుగుతోంది, దీనిని పరిష్కారం చేయాలని అన్నారు.
సీఎం సీటు బదిలీకి పట్టు
పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
తరువాతేనన్న హైకమాండ్
అప్పటికై నా మాట నిలబెట్టుకోవాలన్న డీసీఎం!
విదేశాల నుంచి ఎమ్మెల్యేల రాక
సీటు మార్పిడిపై వ్యాఖ్యలు
శివాజీనగర: కాంగ్రెస్‌లో సీఎం సిద్దరామయ్య అనుకూల వర్గం ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర కుతూహలం మధ్య విదేశీ యాత్రను ముగించుకుని బుధవారం తెల్లవారుజామున తిరిగి వచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పిడి రచ్చ జరుగుతున్న సమయంలో ఈ విదేశీ టూర్‌పై విమర్శలు వచ్చాయి. కొందరు ఎమ్మెల్యేలు విమానాశ్రయం నుంచి మీడియా కంటికి చిక్కకుండా వెళ్లేందుకు యత్నించారు. ఈ సమయంలో జగళూరు ఎమ్మెల్యే దేవేంద్రప్ప మాట్లాడుతూ కుటుంబ సమేతంగా పర్యటనకు వెళ్లాం, అధికారికంగా అధ్యయన పర్యటన కాదు, పాడిపరిశ్రమ, వ్యవసాయం గురించి పరిశీలించాం, అక్కడి వ్యవసాయానికి, మన వ్యవసాయానికి చాలా తేడా ఉంది. అక్కడి పద్ధతులను మనం అమలు చేయాలి అని అన్నారు. ఇక్కడే ఉండి ఏమి చేయాలి, అయితే అక్కడికి వెళ్లి ఏమి చేయగలం? అని అన్నారు. రాజకీయాలను చర్చించలేదన్నారు. మూడు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతోంది, మరో రెండేళ్లూ ఇదే కొనసాగుతుంది అని కుర్చీ మార్పిడి తతంగంపై వ్యాఖ్యానించారు.


