లక్ష్మీ నరసింహ రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీ నరసింహ రథోత్సవం

Mar 5 2026 7:20 AM | Updated on Mar 5 2026 7:20 AM

బొమ్మనహళ్లి: బెంగళూరు గ్రామీణ జిల్లాలోని మాగడి తాలూకాలో శుకపురిగా ప్రసిద్ధి చెందిన సుగ్గనహళ్లిలో బుధవారం లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం రమణీయంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు జరిగాయి. ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి తేరులో ప్రతిష్టించారు. ఎమ్మెల్యే హెచ్‌.సి. బాలకృష్ణ రథోత్సవాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రథోత్సవం సందర్భంగా ఓ గరుడ పక్షి రథం చుట్టూ ప్రదక్షిణ చేసింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తజనం తరలివచ్చారు.

పవిత్రకు ఇంటి భోజనం రద్దు

దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడకు హైకోర్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లో ఉన్న ఆమెకు వారానికి ఒకసారి ఇంటి నుంచి భోజనం వెళ్లేది. అయితే ఇప్పుడు హైకోర్టు ఇంటి భోజనానికి అనుమతిని నిరాకరించింది. ఆమెతో పాటు ఇతర నిందితులు నాగరాజు, లక్ష్మణ్‌కు ఉన్న ఈ సౌకర్యాన్ని ప్రశ్నిస్తూ జైలు అధికారులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కింది కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ, కోరినప్పుడల్లా ఇంటి భోజనం ఇవ్వడం కుదరదని జడ్జి ఆదేశించారు.

పాఠశాలలో హెచ్‌ఎం మృతి

యశవంతపుర: విద్యార్థులకు పాఠం చెబుతుండగా గుండెపోటు వచ్చి ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఘటన హాసన జిల్లా అరకలగోడు తాలూకా కెబ్బెకొప్పలు గ్రామంలో జరిగింది. హెచ్‌ఎం సతీశ్‌ (53) బుధవారం తరగతిలో పాఠం చెబుతూనే కిందపడిపోయారు. విద్యార్థులు మరో ఉపాధ్యాయునికి చెప్పగా అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ వచ్చేలోపు సతీశ్‌ తుదిశ్వాస విడిచారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు.

అత్త పోరు..

మహిళా టెక్కీ ఆత్మహత్య

యశవంతపుర: మంచి ఉద్యోగం, దండిగా జీతం.. కానీ కుటుంబ కలహాలతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు అబ్బిగెరెలో జరిగింది. అత్త వేధింపులే కారణమని ఆరోపణలున్నాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన సుష్మ (35) డెల్‌ సంస్థలో ఐటీ ఇంజనీరు, ఐదేళ్ల క్రితం పునీత్‌కుమార్‌తో పెళ్లి కాగా, 4 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇంటిలో చిన్నచిన్న విషయాలపై అత్త కల్పనతో సుష్మకు గొడవలు జరిగేవి. మంగళవారం అత్తతో పోట్లాట జరిగింది. దీంతో ఆవేదన చెందిన సుష్మ ఇంటిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. అత్త, భర్త వేధింపుల వల్లనే తమ కూతురు చనిపోయిందని, అదనపు కట్నం తేవాలని సతాయించేవారని సుష్మ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, సోలదేవనహళ్లి పోలీసులు విచారణ చేపట్టారు.

కావేరి నదిలోకి దూకి

బలవన్మరణం

మైసూరు: కుటుంబ గొడవలతో విసిగిపోయిన మహిళ కావేరి నదిలోకి దూకింది. చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా కినకహళ్లి గ్రామానికి చెందిన రశ్మీ (39)కి పొరుగూరికి చెందిన లోకేశ్‌తో పెళ్లయింది. ఇద్దరూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. కానీ కుటుంబ కలహాలతో విరక్తి చెందిన ఆమె బెంగళూరు నుంచి తమ జిల్లాలోని శివనసముద్రానికి వచ్చింది. అక్కడ వెస్లీ వంతెన పై నుంచి కావేరి నదిలోకి దూకడంతో ప్రాణాలు పోయాయి. బంధువుల, కొళ్లేగాళ గ్రామీణ పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు.

మెడికల్‌ సీటు అని

రూ.25 లక్షలు మస్కా

బనశంకరి: యువతికి ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తామని నమ్మించి రూ.25 లక్షల వంచనకు పాల్పడిన ముఠా ఉదంతమిది. ఫిర్యాదు మేరకు డాక్టర్‌ కేపీ శరత్‌తో పాటు నలుగురిపై బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. షంషేర్‌ బేగ్‌, సయ్యద్‌ తబ్రేజ్‌, డాక్టర్‌ శరత్‌ కలిసి యువతి ఆయేషా తండ్రి లాల్‌బాబును కలిసి మీ కూతురికి ఎంబీబీఎస్‌ సీటును ఇప్పిస్తామని కాలేజీ డొనేషన్‌ ఫీజుల పేరుతో రూ.25 లక్షలు వసూలు చేశారు. అయితే ఎన్ని నెలలు గడిచినా సీటును ఇప్పించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement