తెలుగు భాషను కాపాడుకోవాలి
హొసపేటె: ప్రవాసాంధ్రులు ఐక్యంగా తెలుగు భాషను కాపాడుకోవాలని హైదరాబాద్ కల్లుగీత కులాల సమాఖ్య అధ్యక్షుడు కోళ్ల ఈశ్వర ప్రసాద్ అన్నారు. హొసపేటెకు వచ్చిన ఆయనను గురువారం సాయంత్రం టీబీ డ్యాంలోని కర్ణాటక తెలుగు సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో కాకుండా యావత్ ప్రపంచంలో తెలుగు వారు స్థిరపడి ప్రజలకు ఉత్తమ సేవలందించడం గౌరవ కారణమని తెలిపారు. తెలుగు వారు నిర్మించిన రామాలయం వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న ప్రారంభం అవుతుందన్నారు. దేశ నలుమూలల నుంచి తెలుగు వారు రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక తెలుగు సంఘం అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వరరావు, కార్యదర్శి ధర్మారావు, కోశాధ్యక్షుడు వెంకటరమణ సభ్యులు రెడ్డి వెంకటేశ్వరరావు, రామానాయుడు, రాధాకృష్ణ, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


