మద్దతు ధరకే రాగుల కొనుగోలు
హోసూరు: క్రిష్ణగిరి జిల్లాలో మద్దతు ధర నిర్ణయించి రైతుల నుంచి రాగులను కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రైతులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ క్రిష్ణగిరి జిల్లాలో వేలాది ఎకరాల్లో రాగి పంటను వర్షాధారంగా రైతులు సాగు చేశారన్నారు. వారి దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించి సమీప ప్రాంతాల్లో కొనుగోలు చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాగలూరు, బేరికె, అంచెట్టి, కుప్పాచిపారై, బోడిచిపల్లి, మదగొండపల్లి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కిలో రాగి రూ.48.86గా నిర్ణయించామన్నారు. అదే విధంగా సింగారపేట రైతుల కలగా ఉన్న పులియూరు ఆనకట్ట నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతుల నుంచి స్వీకరించిన 160 వినతిపత్రాల్లో 147 పత్రాలను పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవిత, కీర్తి, కాళిముత్తు, గుణవతి, రాజన్, చంద్ర, శివంధి, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.


