
4న వీఎస్కేయూ స్నాతకోత్సవం
బళ్లారిటౌన్: నగర శివార్లలోని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ) 13వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 4న ఉదయం 11 గంటలకు యూనివర్సిటీ బయలు రంగమందిరం ఆవరణలో ఏర్పాటు చేసినట్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎం.మునిరాజు తెలిపారు. బుధవారం యూనివర్సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ స్నాతకోత్సవంలో వివిధ రంగాల్లో సాధన చేసిన ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్, న్యూఢిల్లీ ఇంటర్ యూనివర్సిటీ ఎక్సలేటర్ డైరెక్టర్ అవినాష్ చంద్రపాండే, ఉన్నత విద్యా శాఖ మంత్రి ఎంసీ సుధాకర్ పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈసారి వివిధ రంగాల్లో సేవలందించిన ఇర్ఫాన్ రజాక్, డాక్టర్ వసుంధర భూపతి, బావిహళ్లి నాగనగౌడలకు గౌరవ డాక్టరేట్ అందిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక 42 మంది విద్యార్థులకు 51 బంగారు పతకాలను, వివిధ విభాగాల్లో పరిశోధన చేసిన 59 మందికి డాక్టరేట్ పట్టాలను, అన్ని విభాగాల్లో స్నాతకోత్సవ పట్టాలు పొందిన 80 మంది విద్యార్థులకు కలిపి మొత్తం 155 మంది విద్యార్థులకు ర్యాంక్ ప్రమాణ పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్.హంస అనే విద్యార్థిని నాలుగు బంగారు పతకాలు, రాజేశ్వరి అనే విద్యార్థిని మూడు పతకాలు సాధించినట్లు వివరించారు. రిజిస్ట్రార్లు నాగరాజు, ఎన్‌ఎం సాలి పాల్గొన్నారు.