● తండ్రి మృతికి ప్రతీకారం తీర్చుకున్న పుత్రుడు
రాయచూరు రూరల్: 17 ఏళ్ల క్రితం తండ్రిని హత్య చేసిన వ్యక్తిని చంపుతానని శపథం చేసిన కొడుకు హత్య చేసిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం కలబుర్గి తాలూకా సీతనూరు శివరాయ మాలి పాటిల్(55)ను లక్ష్మికాంత్(29) మారణాయుధంతో దాడి చేసి హతమార్చాడు. 2008లో శివరాయ లక్ష్మికాంత్ తండ్రి నాగేంద్రప్పను హత్య చే శాడనే ఆరోపణల మేరకు ఈ హత్య చేశాడని కలబుర్గి పోలీస్ కమిషనర్ శరణప్ప తెలిపారు. నాగేంద్రప్ప అన్న భార్యతో శివరాయ పాటిల్ అక్రమ సంబంధం కలిగి ఉన్న విషయం తెలుసుకున్న నాగేంద్రప్పను అడ్డు తొలగించుకునేందుకు శివరాయ హత్య చేశాడన్నారు. పాత కక్షలు మనస్సులో పెట్టుకొని శివరాయను నాగేంద్రప్ప కొడుకు లక్ష్మీకాంత్ హత్య చేసినట్లు తెలిపారు. కలబుర్గి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పాము కాటుతో రైతు మృతి
రాయచూరు రూరల్: పాము కాటుకు గురై ఓ రైతు మృతి చెందిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. దేవదుర్గ తాలూకా నవిలుగుడ్డలో హొన్నప్ప(40) అనే వ్యక్తి మరణించాడు. పొలంలో పని చేస్తుండగా పాము కరవడంతో చికిత్స నిమిత్తం రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల పరిశోధన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స ఫలించక మంగళవారం రాత్రి మరణించాడు.
గుండెపోటుతో
అన్నదమ్ముల మృతి
రాయచూరు రూరల్: తమ్ముడికి గుండెపోటు వార్త విన్న అన్న కూడా గుండెపోటుతో మరణించిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం సురపుర తాలూకా కెంబావిలో ఇర్ఫాన్ పేష్‌మామ్(38) అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా సోదరుడు శంశుద్దీన్‌న్‌పేష్‌మామ్(42) కూడా అదే వాహనంలో యాదగిరికి వెళుతుండగా మార్గమధ్యంలో ఇద్దరు అసువులు బాసారు. ఈ ఘటనపై కెంబావి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
విద్యాభివృద్ధి పనులకు నిధులు మంజూరు
రాయచూరు రూరల్: నగరంలో విద్యారంగ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ వసంత్ కుమార్ శ్రీకారం చుట్టారు. బుధవారం ఎల్‌వీడీ కళాశాలలో పలు నిర్మాణ పనులకు రూ.30 లక్షల నిధులను మంజూరు చేశామన్నారు. కళాశాలలో మంచి క్రమశిక్షణతో కూడిన విద్య, అన్ని విధాలుగా సౌకర్యాలతో కళాశాలలో విద్యనభ్యసిస్తే విద్యార్థులు ఉన్నత పదవులను అలంకరిస్తారన్నారు. ఈ సందర్భంగా సుఖాణి, రజాక్ ఉస్తాద్, పవన్ కుమార్, అరుణ, శ్రీనివాస్‌లున్నారు.
పైగంబర్ జీవిత చరిత్ర
అభియాన్ ప్రారంభం
బళ్లారిటౌన్: పైగంబర్ మహ్మద్‌పై ఈ నెల 28 వరకు జిల్లా వ్యాప్తంగా జీవిత చరిత్ర అభియాన్‌ను ప్రారంభించినట్లు అభియాన్ సమితి ప్రముఖుడు సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. బుధవారం పత్రికా భవన్‌లో పైగంబర్ మహ్మద్ జీవిత చరిత్రపై పుస్తకావిష్కరణ చేసి మాట్లాడారు. బళ్లారి, విజయనగర జిల్లాల్లో నెల రోజుల పాటు అభియాన్‌ను చేపట్టినట్లు తెలిపారు. పైగంబర్ మహ్మద్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలకు వ్యాసరచనలను ఈనెల 15 లోగా అందజేయాలని తెలిపారు. ముగింపు కార్యక్రమాన్ని ఆరోజు సాయంత్రం 6.30 గంటలకు జోళదరాశి దొడ్డనగౌడ మందిరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సయ్యద్ నాసీర్ అలీ, లతీఫ్ అహ్మద్, మెహదబీన్, సుల్తాన, ఫర్వీన్ తదితరులు పాల్గొన్నారు.