
బెంగళూరు: కర్ణాటకలో ఓ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. మహిళా పోలీస్ ఉన్నతాధికారిపై సదరు ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా ఎస్పీని ఉద్దేశించి ఆమె కాంగ్రెస్ నేతల ఇంట్లో ‘పెంపుడు కుక్క’లా వ్యవహరిస్తున్నారు అని సంచలన ఆరోపణలు గుప్పించారు. దీంతో, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై పోలీసు ఉన్నతాధికారులు మండిపడుతున్నారు.
వివరాల ప్రకారం.. హరిహర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్ మంగళవారం దావణగెరెలో రిపోర్టర్స్ గిల్డ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని. ప్రజలు నన్ను గెలిపించారు. కానీ, నాపై పట్ల పోలీసులు వైఖరి భిన్నంగా ఉంది. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ నన్ను ఏదైనా కార్యక్రమంలో చూస్తే ముఖం చిట్లించుకుంటున్నారు. అదే కాంగ్రెస్‌కు చెందిన షామనూరు కుటుంబ సభ్యుల కోసం మాత్రం గేటు వద్ద పడిగాపులు కాస్తున్నారు. అచ్చం వాళ్లింట్లోని పోమరేనియన్ కుక్కలా ఆమె ప్రవర్తన ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలు చేశారు.
అంతటితో ఆగకుండా.. కొన్ని సంఘటనలను ఉదాహరణగా చూపుతూ హరిహర నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ తనను పట్టించుకోకుండా, అగౌరవ పరిచారని అన్నారు. గాంధీ భవన్ వద్ద మండుటెండలో ఎంపీ ప్రభా మల్లికార్జున్ కోసం ఎస్పీ గంటల తరబడి ఎదురుచూశారు. నేనూ ప్రజాప్రతినిధినే, ఆమె కూడా ప్రజాప్రతినిధే. మరి ఈ వివక్ష ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారి అండ చూసుకుంటే మంచిదని ఎస్పీ భావిస్తున్నారని, కానీ ఇదంతా తాత్కాలికమేనని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో, అక్కడున్న వారు, పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.
అనంతరం, ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వయంగా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం దావణగెరెలోని కేటీజే నగర్ పోలీస్ స్టేషన్‌లో హరీశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. షామనూర్ కుటుంబానికి దావణగెరెలో రాజకీయ పలుకుబడి ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షమనూర్ శివశంకరప్ప ఎమ్మెల్యేగా ఉండగా.. ఆయన కుమారుడు ఎస్ఎస్ మల్లికార్జున్ సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో గనులు, భూగర్భ శాస్త్రం, ఉద్యానవన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కోడలు ప్రభా మల్లికార్జున్ పార్లమెంటు సభ్యురాలుగా(ఎంపీగా) కొనసాగుతున్నారు.