
గ్రామాలకు రక్షిత తాగునీరు అందించండి
● అధికారులకు జెడ్పీ సీఈఓ సూచన
హొసపేటె: జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు ముందు పరీక్షలు తప్పనిసరి చేయాలని జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్ మహ్మద్ అక్రమ్ అలీ షా అన్నారు. నగరంలోని జెడ్పీ కార్యాలయ హాలులో బుధవారం జరిగిన జిల్లా నీరు, పారిశుధ్య మిషన్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాటారు. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా, రక్షిత తాగునీటి యూనిట్, జలజీవన్ మిషన్(జేజేఎం) ద్వారా సరఫరా చేసిన నీటిని తాగడం తప్పనిసరి అని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నిరంతరం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేసే ముందు పరీక్షించడం తప్పనిసరి అన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఎఫ్‌టీకే కిట్ల ద్వారా నీటిని పరీక్షించి, నివేదిక సమర్పించాలన్నారు. నీటి కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా, తాగునీటి స్వచ్ఛతపై శ్రద్ధ వహించాలన్నారు. జేజేఎం ప్రాజెక్ట్ కింద పూర్తయిన పనులను హర్ ఘర్ జల్‌గా ప్రకటించడం ద్వారా నిరంతర నీటి సరఫరా గ్రామాలుగా మార్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
నిరంతర నీటి సరఫరాకు చర్యలు తీసుకోండి
జిల్లాలోని కూడ్లిగి తాలూకా రామదుర్గ, కక్కుప్పి, కొట్టూరు తాలూకాలోని కందగల్లు, రాంపుర, చిరబి, హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని కల్లహళ్లిలను నిరంతర నీటి సరఫరా గ్రామాలుగా ప్రకటించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీలు, పాఠశాలలు, నివాస పాఠశాలలకు నీటిని పరీక్షించి సరఫరా చేయాలన్నారు. జిల్లా ఆస్పత్రి, తాలూకా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసే సిబ్బంది పరిశుభ్రతను పాటించాలన్నారు. రామదుర్గ జీపీ అధ్యక్షుడు రాజప్ప, బైలువద్దిగేరి అధ్యక్షురాలు జే.లక్ష్మిదేవి, హంపీ జీపీ అధ్యక్షురాలు రజనీ షణ్ముకగౌడ, జిల్లా సర్వేయర్ డాక్టర్ షణ్ముఖ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.దీపా, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ముదకప్ప, పట్టణాభివృద్ధి కోశ జిల్లా నోడల్ అధికారి మనోహర్, ప్రభుత్వ విద్యా శాఖ ఉప సంచాలకులు రాజశేఖర్, జేజేఎం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సీఎం మహేశ్వరి, ఇంజినీర్లు రుద్రముని, నరేష్, శివారెడ్డి, స్వచ్ఛ భారత్ మిషన్ రేణుక తదితరులు పాల్గొన్నారు.