
బ్లాక్‌లో యథేచ్ఛగా యూరియా దందా
సాక్షి,బళ్లారి: యూరియా కంపెనీలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి అన్నదాతను నిలువునా ముంచుతున్నారు. ఈ సారి తుంగభద్ర ఆయకట్టు కింద బళ్లారి జిల్లాతో పాటు రాయచూరు, కొప్పళ, విజయనగర నాలుగు జిల్లాల్లో సకాలంలో వరినాట్లతో పాటు పత్తి, మిర్చి నాట్లు కూడా పూర్తి చేశారు. లక్షలాది ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేసి నెల రోజులు కావస్తోంది. వరి నాట్లు వేసిన తర్వాత రైతులకు యూరియా అత్యవసరం. తుంగభద్ర ఆయకట్టు కింద ఈ సారి ఖరీఫ్ పంట మాత్రమే పండించుకునేందుకు అవకాశం కల్పించారు. డ్యాం గేట్లకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నందున రబీ పంటకు నీరందించలేమని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో ఈ సారి ఒకే పంటతో రైతులు సరిపెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. పాలకుల తప్పిదం, నిర్లక్ష్యంతో డ్యాంలోకి నీరు పుష్కలంగా వస్తున్నప్పటికీ గేట్లను సరైన సమయంలో మార్చక పోవడం వల్ల రైతులకు ఒక పంట కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది.
రైతన్నలకు అష్టకష్టాలు
ఈ తరుణంలో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలనైనా దక్కించుకుందామని కోటి ఆశలతో రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. పెట్టిన పంటలకు సరైన పోషకాలు అందించే ఎరువులను అందించాల్సిన పాలకులు, వ్యాపారులు రైతుల సమస్యలు పట్టించుకోక పోగా సందట్లో సడేమియా అన్న చందంగా యూరియా కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీంతో రైతులు అప్పులు చేసి అధిక ధరకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ఒక్క బళ్లారి జిల్లాకే 50 వేల టన్నుల యూరియా అవసరం ఉండగా కేంద్ర ప్రభుత్వం నుంచి 45 వేల టన్నుల యూరియా సరఫరా చేశామని, అందులో రైతులకు 41 వేల టన్నులు విక్రయించామని చెబుతున్నారు. వాస్తవంగా అందులో సగం అంటే 20 వేల టన్నులు కూడా రైతులకు అందలేదనే విమర్శలు ఉన్నాయి.
నెల రోజులుగా ఎరువు కొరత
స్పిక్, మంగళ ,క్రిబ్కో తదితర 8 యూరియా కంపెనీల నుంచి నేరుగా 250 మంది డీలర్లు, 450 ఫర్టిలైజర్స్ షాపులు, 80 సహకార సంఘాలకు సరఫరా చేయడంతో ఆయా వ్యాపారులు రైతులకు యూరియా అమ్మకాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి యూరియా కొరత కంపెనీలు సృష్టించాయా లేక వ్యాపారులు సృష్టించారో తెలియదు కానీ గత నెల రోజుల నుంచి యూరియా కొరత ఉందని ఫర్జిలైజర్స్ షాపులు, సహకార సంఘాలు, డీలర్లు చెబుతూ ఆయా షాపుల్లో యూరియా లేదంటూ చేతులెత్తేశారు. అయితే యూరియా కొరత సృష్టించిన వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో ఒక బస్తా యూరియాను రూ.500 నుంచి రూ.600 వరకు యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తుండటంతో రైతులకు గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. గత్యంతరం లేక పెట్టిన పంటలు పెట్టుబడులకు కూడా దక్కకుండా పోతాయనే భయంతో యూరియాను కొనుగోలు చేస్తున్నారు.
రైతుల్ని నట్టేట ముంచుతున్నారు
ఈ సందర్భంగా తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ మాట్లాడుతూ బళ్లారి జిల్లాకు 50 వేల టన్నులు, రాయచూరు, విజయనగర, కొప్పళ జిల్లాలకు కూడా వేలాది టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీలు యూరియా సరఫరా చేశామని చెబుతున్నారే కానీ డీలర్లు, వ్యాపారులు కుమ్మకై ్క యూరియా కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో యూరియా అమ్ముతూ రైతులను నట్టేటా ముంచుతున్నారన్నారు. వ్యవసాయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో పాటు పాలకులు కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో యూరియా వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో యూరియాను అమ్ముతున్నారన్నారు. బుధవారం రోజు ఏకంగా ఒక బస్తా యూరియా రూ.600 వరకు లోలోపల అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. రైతులకు కూడా ప్రస్తుతం యూరియా ఎరువు అవసరం ఉన్నందున బ్లాక్ మార్కెట్‌లోనే యూరియాను కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఎరువుల వ్యాపారులు
బస్తా ధర రూ.275 వరకు అమ్మాలని నిబంధన
నల్లబజారులో రూ.600 ధర వరకు విక్రయం

బ్లాక్‌లో యథేచ్ఛగా యూరియా దందా