
6న బసవ సంస్కృతి అభియాన్
బళ్లారిటౌన్: నగరంలోని బసవ భవనంలో ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు బసవ సంస్కృతి అభియాన్‌ను ఏర్పాటు చేసినట్లు అభియాన్ సమితి జిల్లాధ్యక్షుడు ఎంజీ బసవరాజప్ప తెలిపారు. బుధవారం పత్రికాభవనంలో సమితి నేత సిరిగేరి పన్నారాజు తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా రాయచూరు నుంచి వస్తున్న బసవ జ్యోతి రథయాత్రకు ఆ రోజు ఉదయం 9.30 గంటలకు మోకా రోడ్డులోని కేఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్ వద్ద స్వాగతం పలికి మోటర్ బైక్‌ల ద్వారా నగరంలో ప్రధాన వీధుల్లో ఊరేగింపు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం గాంధీనగర్‌లోని అల్లం సుమంగళమ్మ కళాశాలలో విద్యార్థులకు, ప్రజలకు సంవాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు కిత్తూరు రాణి చెన్నమ్మ హైస్కూల్ ప్రాంగణం నుంచి బసవ భవన్ వరకు పథ సంచలన ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విరక్త మఠం మహంత ప్రభు స్వామితో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో సమితి నేతలు చంద్రమౌళి, శంకర్, లేపాక్షప్ప, సంగనకల్లు హిమంతరాజు, యోగిరాజ్, సురేష్, కేణిబసప్ప, చెన్నబసయ్య, మీనళ్లి చంద్రశేఖర్, శరణగౌడ పాల్గొన్నారు.