
వైద్యులకు అంతఃకరణ శుద్ధి అవసరం
సాక్షి,బళ్లారి: వైద్యో నారాయణ హరీ.. అన్నారు పెద్దలు. అయితే ఆ వాక్యం రోజురోజుకు ప్రజలకు దూరం కావడంతో పాటు స్వాఽర్థ చింతనతో వైద్యులు పని చేస్తున్నారని, రోగాలను నయం చేసే వైద్యులే రోగగస్త్ర వ్యవస్థగా మారడం శోచనీయమని ప్రముఖ మేధావి డాక్టర్ రహమత్ తరీకెరె ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని బీపీఎస్‌సీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నడ వైద్య రచయితల సంఘం, భారతీయ వైద్యకీయ సంఘం సహకారంతో కన్నడ వైద్య రచయితలు 6వ రాష్ట్ర సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ముందుగా ఆయుర్వేద రత్న డాక్టర్ తారానాథ పండిట్‌ను స్మరించుకున్నారు. ఇలాంటి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం కన్నడ భాషకు, సాహిత్యానికి ఉత్తమ కానుక అన్నారు. అంతేకాక వైద్యులు కూడా సాహితీవేత్తలుగా ఎదగడానికి దోహదం చేస్తుందన్నారు. వైద్య సాహిత్యం గురించి మాట్లాడుతూ సాహిత్యాన్ని మూడు ప్రకారాలుగా విభజించారన్నారు. వైద్యసాహిత్యం, వైద్యులు రచించిన సాహిత్యం, అలాగే వైద్యులు పాత్రధారులైన సాహిత్యం గురించి ఆయన మాట్లాడారు. ఆరోగ్య బాధలు, శారీరక నొప్పులు ఉన్న వారిని గట్టెక్కించడానికి వైద్యుల సేవలు అపూర్వమన్నారు.
వ్యాపారమయంగా వైద్యరంగం
అయితే కొందరు వైద్యులు వైద్య రంగాన్ని వ్యాపారమయం చేసుకుంటూ ప్రజల్లో చెడును రేకెతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాహిత్య రంగంలో వైద్యులను ఉన్నత స్థానంలో చిత్రీకరించారన్నారు. ఆ ఘనతను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు ఆత్మశుద్ధి, అంతఃకరణ శుద్ధితో సేవలు చేయాలని సూచించారు. రచనలు చదవడమనే పద్ధతి నానాటికీ తగ్గుముఖం పట్టి వినడం వరకే మార్పు చెందుతున్న ప్రస్తుత సమాజంలో జానపద సాహిత్యం అత్యవసరం అన్నారు. డాక్టర్లు వృత్తిపరంగానే కాకుండా సామాజిక రంగంలో కూడా సేవలు అందించాలన్నారు. వైద్య రంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సామాజిక, ఆరోగ్యానికి వైద్య సాహిత్య వారధిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు చినివాలర్, ప్రముఖ డాక్టర్లు డాక్టర్ అరవింద్ పాటిల్, డాక్టర్ మాణిక్యరావు, డాక్టర్ దివాకర్ గడ్డి, డాక్టర్ యోగానందరెడ్డి, డాక్టర్ వీణా, డాక్టర్ సుమా గడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైద్యులే రోగగ్రస్త వ్యవస్థగా మారడం శోచనీయం
ప్రముఖ మేధావి డాక్టర్ రహమత్ తరీకెరె ఆవేదన