
శాంతి భద్రతల దృష్ట్యా 22 మందికి సరిహద్దు బహిష్కరణ
● పోలీస్ కమిషనర్ శశికుమార్
హుబ్లీ: వినాయక చవితి ఉత్సవాలు, ఈద్ మిలాద్ పండుగల నేపథ్యంలో జంట నగరాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నేరాల నేపథ్యం కలిగిన 22 మందిని సరిహద్దుల నుంచి బహిష్కరించినట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వీరంతా సంఘటిత నేరాలు, ఎన్‌డీపీఎస్ కేసులతో పాటు ఇతర నేరాల్లో పాల్గొన్నారన్నారు. కలబుర్గి, బళ్లారి, మైసూరు, మంగళూరు, బెళగావి, బెంగళూరు, దావణగెరె జిల్లాల నిర్ధిష్ట పోలీస్ స్టేషన్ల పరిధి వరకు సరిహద్దుల నుంచి బహిష్కరించామన్నారు. పదేపదే నేరాలలో పాల్గొనే వారిపై బహిష్కరణ వేటు వేస్తామన్నారు. ఈ ఆదేశం 6 నెలల పాటు అమలులో ఉంటుందన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇంతవరకు 105 మందిపై వేటు
2025లో ఇప్పటి వరకు నేరాల నేపథ్యంలో భాగంగా 105 మందిని సరిహద్దుల నుంచి బహిష్కరించామన్నారు. తొలి దశలో 52 మంది, రెండవ దశలో 31, మూడవ దశలో 22 మందిని బహిష్కరించినట్లు తెలిపారు. 2023లో 22 మందిని, 2024లో 23 మంది బహిష్కరించామన్నారు. ఇక తాజాగా బెండిగేరి, కసబాపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నలుగురు చొప్పున, పాత హుబ్లీలో ముగ్గురు, ధార్వాడ టౌన్, హుబ్లీ ఉపనగర స్టేషన్ పరిధిలో ఒక్కొక్కరిని సరిహద్దుల నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. హుబ్లీలో తాజాగా రౌడీల పరేడ్ నిర్వహించామన్నారు. 75 శాతం మంది రౌడీలు హాజరయ్యారు. ఈ రెండు పండుగల సందర్భంగా ఎటువంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలను చేపట్టామన్నారు. డీసీపీలు సీఆర్ రవీష్, మహానంద నందగావిలు పాల్గొన్నారు.