
ఏబీసీడీ వర్గీకరణ అమలు హర్షణీయం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయడం హర్షణీయమని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సంచాలకుడు రవీంద్రనాథ్ పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణకు కాంగ్రెస్ సర్కార్‌కు జస్టిస్ నాగ మోహన్ దాస్ నివేదికను అందించినందున అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించారన్నారు. ఎస్సీలకు సంబంధించి సమావేశాలు నిర్వహించకుండా కాలయాపన చేశారని, ఈ విషయంపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
నైరుతీ రైల్వే పండుగ
ప్రత్యేక రైళ్లు
హుబ్లీ: వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నైరుతీ రైల్వే సిద్దారూడ హుబ్లీ– మంగళూరు సెంట్రల్ స్టేషన్ల మధ్య ఒక ట్రిప్ చొప్పున ప్రత్యేక రైలు సంచారం ప్రారంభిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నెల 26న హుబ్లీ నుంచి బయలుదేరి మరుసటి రోజు 11:45 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి 27న మధ్యాహ్నం 2.15 గంటలకు మంగళూరు సెంట్రల్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:45 గంటలకు హుబ్లీకి చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలు హావేరి, హరిహర, అరసికెరె, తుమకూరు, యశ్వంత్‌పూర్, చెన్నరాయపట్టణ, హాసన, సకలేశపుర మీదుగా మంగళూరు చేరుకుంటుందని, ఈ రైలుకు 17 బోగీలు ఉంటాయని తెలిపారు. ఒక ఏసీ టూటైర్, ఒక ఏసీ త్రీటైర్, 10 స్లీపర్, మరో మూడు జనరల్ సెకండ్ క్లాసు బోగీలు, రెండు సెకెండ్ క్లాస్ లగేజీ కం బ్రేక్ వ్యాన్లు ఉంటాయన్నారు. జనరల్ కంపార్ట్‌మెంటు కూడా ఉంటుందన్నారు.
బకాయి వేతనాలు చెల్లించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని కర్ణాటక సంయుక్త హాస్టల్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు అయ్యాళప్ప మాట్లాడారు. సాంఘీక సంక్షేమ, వెనుక బడిన వర్గాల శాఖల హాస్టల్‌లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల మూడు నెలల వేతనాలు చెల్లించాలన్నారు. ఈ విషయంలో ఏజెన్సీ చేస్తున్న తప్పిదాలను అరికట్టి బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
పోరాట అనుభవాల
కథాంశాలే చరిత్ర
హుబ్లీ: దేశ ఉజ్వల భవిత నిర్మాణంలో విద్యార్థులకు చరిత్ర ప్రజ్ఞ అవసరం అని, ఇలాంటి పోరాట అనుభవాలు కథలుగా మారాయని ధార్వాడ జూనియర్ కళాశాల విద్యా శాఖ డీడీ డాక్టర్ నారాయణకర్ అన్నారు. గురువారం ధార్వాడ కర్ణాటక విద్యావర్ధక సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అఖండ ధార్వాడ జిల్లా పోరాట స్వాతంత్య్ర సమరయోధులు అనే గ్రంథాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. జిల్లాధికారి సూచనల మేరకు అఖండ జిల్లాలోని 77 జూనియర్ కళాశాలల్లోని 45 మంది లెక్చరర్లతో స్వాతంత్య్ర సమరయోధులు, యశోగాధలను స్మరించే ఉపన్యాసాలను పుస్తకంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకించి సైన్స్ చదివే విద్యార్థులకు ఇతిహాసంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు ఉదయ్ నాయక్, డాక్టర్ బసవరాజు అక్కి, డాక్టర్ సంజీవ కులకర్ణి పాల్గొన్నారు.
పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగంలో అధికంగా గ్రామీణ ప్రాంతాల్లోని నివసిస్తున్న పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలని ఇళ్లు భూ పోరాట సమితి అధ్యక్షుడు మారెప్ప పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధీనంలో సాగు చేస్తున్న భూములు సన్నకారు రైతులకు అవకాశాలున్న అదికారులు రైతులపై కేసు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కుతో వాటిని లాక్కొంటున్నట్లు ఆరోపించారు. పేదలకు గూడు, కూడు, గుడ్డ అనే సామెతకు తిలాంజలి పలుకుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు భూమి, ఇళ్ల పట్టాలను అందించాలన్నారు.

ఏబీసీడీ వర్గీకరణ అమలు హర్షణీయం

ఏబీసీడీ వర్గీకరణ అమలు హర్షణీయం