
మరో 50 టీఎంసీలు కాపాడుకోవాలి
సాక్షి బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగు నీటిని అందించే తుంగభద్ర జలాశయం నుంచి మరో 50 టీఎంసీల నీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలు చేపట్టాలని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన తుంగభద్ర డ్యాంలోని సమస్యలు, వాటి నివారణపై సుదీర్ఘంగా చర్చించారు. క్రస్ట్‌గేట్ల మరమ్మతులకు కర్ణాటక ప్రభుత్వం నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది క్రస్ట్‌గేట్ల ఏర్పాటు, డ్యాంలో సమస్యల పరిష్కారానికి రబీలో నీరందించేందుకు సాధ్యం కాదని ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ అసెంబ్లీలో ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఉత్తర కర్ణాటక పరిధిలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర జిల్లాలకు జీవనాడిగా పేరొందిన తుంగభద్ర ఆయకట్టు రైతులకు రబీలో నీరు ఇవ్వడం సాధ్యం కాదని ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి నెలకొందన్నారు.
సమస్యల శాశ్వత పరిష్కారం అవసరం
డ్యాంలోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకొని రైతులను శాంతింపజేయాలన్నారు. తుంగభద్ర జలాశయ పరిధిలో ఏటేటా పూడిక చేరుకోవడం వల్ల నష్టపోయిన నీటిని తిరిగి పొందేందుకు 50 టీఎంసీల నీటి నిల్వను కాపాడుకునేందుకు మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని అక్కడ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ కూటమి నేత, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారని, ఆయనతో ప్రతిపక్ష నాయకుడు కేఆర్.అశోక్, బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, తాను కూడా వెళ్లి కలిసి చర్చించి ఆయన్ను ఒప్పిస్తామనే నమ్మకం ఉందన్నారు.
సీఎంలు సమన్వయంతో పని చేయాలి
మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సమన్వయంతో పనిచేసి నవలి జలాశయం, సమాంతర కాలువల నిర్మాణాలు పూర్తి చేస్తే 50 టీఎంసీల నీటిని కాపాడుకునే అవకాశం ఉందన్నారు. దీంతో మూడు రాష్ట్రాలకు చెందిన రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఏటా నవలి జలాశయానికి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తున్నారని, ఆ కార్యాచరణ పూర్తి కావాలంటే మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల చర్చ, సమావేశం జరగాల్సిన అవసరముందని గుర్తు చేశారు. తుంగభద్ర సమస్యలు పరిష్కరిస్తే ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందన్నారు. క్రస్ట్‌గేట్ల అమరికకు కర్ణాటక ప్రభుత్వం నిధులను సమకూర్చడం వల్లే కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి దోహద పడిందని గుర్తు చేశారు.
నవలి రిజర్వాయర్‌ను నిర్మించాలి
తెలంగాణ, ఏపీ సీఎంలతో చర్చించాలి
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి